5 March, 2026 | 6:40 PM

ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

05-03-2026 05:00 PM

హనుమకొండ, మార్చి 5 (విజయ క్రాంతి): సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య వీ. రామచంద్రం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళల సాధికారత సమాజ అభివృద్ధికి కీలకమని, విద్య, ఆర్థిక స్వావలంబన, సామాజిక చైతన్యం ద్వారా మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంతి ఆచార్యురాలు వి. శోభ మాట్లాడుతూ మహిళా విద్య ప్రాధాన్యతను వివరించారు. ఆధునిక సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, విద్యావంతులైన మహిళలు కుటుంబం అభివృద్ధికి తోడ్పడటమే కాక సమాజానికి మార్గదర్శకులవుతారని తెలిపారు.సన్‌రైస్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ స్వాతి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెప్పారు.

ఆరోగ్య అవగాహన, సరైన జీవనశైలి ద్వారా మహిళలు ఆరోగ్యంగా ఉండటం కుటుంబ సుఖశాంతికి ఆధారం అవుతుందని వివరించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జ్యోతి అధ్యక్షత వహించి మాట్లాడుతూ విద్యార్థినులు ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో నాయకత్వ పాత్ర పోషించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రెహ్మాన్, మహిళా విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.