18-07-2025 12:59:55 AM
హైదరాబాద్/మేడ్చల్, జూలై 17 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అక్రమాల వెనుక మాజీమంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి ఆరో పించారు. ఈ మేరకు గురువారం సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిసి ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్‌మోహన్‌రావు రావడం లో కేటీఆర్, కవిత కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు.
హెచ్‌సీఏ ప్రెసి డెంట్‌గా జగన్‌మోహన్‌రావు గెలవగానే తన విజయం కేటీఆర్, కవిత, హరీశ్‌రావుకు అంకితం చేసినట్టు చెప్పారని గుర్తు చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కవిత, కేటీఆర్‌తోపాటు హెచ్‌సీఏలో ఉన్న మరికొందరు అక్రమార్కులపై కూడా దర్యా ప్తు చేయాలని కోరారు. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్త అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు.
క్రికెట్ అభివృద్ధి కోసం గ్రాంట్ల రూపంలో బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు గత పదేళ్లలో దాదాపు రూ.500కోట్ల నుంచి రూ.600కోట్ల వరకు నిధులు వచ్చాయని పేర్కొన్నారు. అయినా హైదరాబాద్‌లో ఎక్కడా క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. హెచ్‌సీఏ కోసం ఎలాంటి ఆస్తులను నిర్మించలేదని, క్లీన్ అండ్ ఫ్రీ ఆస్తులను కొనుగోలు చేయలేదని వివరించారు.
గత పదేళ్లుగా హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లలో చాలామంది వ్యక్తిగత ఆస్తుల పెరుగుదలను పరిశీలిస్తే, హెచ్‌సీఏలో చోటుచేసుకున్న అవినీతి, మోసపూరిత కార్యకలాపాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని టీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఫిర్యాదులో కోరారు.
సీఐడీ కస్టడీలో నిందితులు..
హెచ్‌సీఏ అవినీతి కేసులో అరెస్టు అయిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటె, శ్రీచక్ర క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్రయాదవ్, ఆయన భార్య శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవితను సీఐడీ గురువారం కస్టడీలోకి తీసుకుంది. న్యాయవాది సమక్షంలో విచా రణ ప్రారంభించింది.
ఫోర్జరీ కేసు, ఐపీఎల్ టికెట్ల వివాదం, హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్‌పై జగన్‌మోహన్‌రావును ప్రశ్నించింది. ఆరు రోజుల పాటు నిందితులను విచారించేందుకు న్యాయస్థానం సీఐడీకి అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా మొదటి రోజు విచారణలో నిధుల గోల్‌మాల్, ఫోర్జరీకి సంబంధించి నిందితులపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం.
బోర్డు రద్దుకు కసరత్తు..
హెచ్‌సీఏ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌రావును సస్పెండ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీసీసీఐకి ప్రభుత్వం లేఖ రాసింది. విజిలెన్స్ రిపోర్టును కూడా బీసీసీఐకి అందజేసింది. హెచ్‌సీఏ ప్రస్తుత బాడీని రద్దు చేయాలని బీసీసీఐకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు హెచ్‌సీఏ కేసుకు సంబంధించి ఉప్పల్ సీఐ ఎలక్షన్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్‌లో తలదూర్చిన నేపథ్యంలో సస్పెండ్ చేసినట్టు సమాచారం. సీఐడీ వస్తున్నట్టు సమాచారాన్ని హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్‌కు ముందుగా లీక్ చేసినందుకుగానూ సీఐ ఎలక్షన్‌రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. సీపీ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కేసు నమోదు చేసిన ఈడీ..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ రంగంలోకి దిగింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. గతంలో నమోదైన రెండు కేసులను కలిపి, కొత్తగా ఈసీఐఆర్, పీఎం ఎల్‌ఏ సెక్షన్ల కింద ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసింది.