28 August, 2026 | 3:33 AM

డీసీసీ పీఠంపై ‘అజేయ’ నేత కన్ను

28-08-2026 02:29 AM

రంగారెడ్డి కాంగ్రెస్ రేసులో మర్రి నిరంజన్ రెడ్డి!

ఆదిభట్ల, ఆగస్టు 27 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం రేసు తీవ్రరూపం దాల్చింది. ఈ కీలకమైన పదవిపై ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ మర్రి నిరంజన్ రెడ్డి దృష్టి సారించారు. ఇటీవల జిల్లాకు విచ్చేసిన డీసీసీ అధ్యక్ష నియామక పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్సీ పీవీ మోహన్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన తన దరఖాస్తును సమర్పించారు.

దీంతో జిల్లా రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నిరంజన్ రెడ్డి పేరు ప్రముఖంగా చర్చకు వచ్చింది.సర్పంచ్ స్థాయి నుండి మున్సిపల్ చైర్మన్ వరకు... ఓటమి ఎరుగని ట్రాక్ రికార్డ్ ఉంది. వృత్తిరీత్యా ఎంబీబీఎస్ పట్టా పొందిన వైద్యుడైన నిరంజన్ రెడ్డి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో స్థానిక నాయకుల ప్రోత్సాహంతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం..

ఆదిభట్ల గ్రామానికి సర్పంచ్గా ఎన్నికై తన రాజకీయ ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించారు. అనంతరం ఎంపీటీసీగా, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ఎంపీపీగా సమర్థవంతమైన పాలన అందించారు. ఆపై మంచాల జెడ్పీటీసీగా బాధ్యతలు నిర్వర్తించి ప్రాంతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

ఆదిభట్ల పురపాలక సంఘం కావడం వల్ల అక్కడ కౌన్సిలర్గా గెలుపొంది, తదనంతరం మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తి చేశారు.సర్పంచ్ స్థాయి నుండి మున్సిపల్ చైర్మన్ వరకు పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ గెలుపొంది, ఇప్పటివరకు రాజకీయ జీవితంలో ’ఓటమి ఎరుగని నేత’గా నిలవడం ఆయనకున్న అరుదైన రాజకీయ బలానికి అద్దం పడుతోంది. 

సామాజిక సేవే ప్రధాన బలం

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ నిరంజన్ రెడ్డి సేవా కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయని పార్టీ వర్గాలు సైతం పరిశీలకులకు విన్నవించారు.పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పదో తరగతి స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం, తాగునీటి కోసం వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయడం వంటి విద్యా సంబంధిత సేవలు అందించారు. అనేక గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలకు, పునర్నిర్మాణాలకు స్వచ్ఛందంగా నిధులు సమకూర్చారు. పదవులతో సంబంధం లేకుండా పార్టీ కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు ఆపద వచ్చిన వేళ నిరంతరం అండగా నిలుస్తున్నారని నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

మంత్రి కోమటిరెడ్డి ఆశీస్సులపై ధీమా..

రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత ఆప్తుడిగా, నమ్మిన బంటుగా పార్టీలో నిరంజన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మంత్రి వెంకటరెడ్డితో ఉన్న సుదీర్ఘ అనుబంధం, రాజకీయ సాన్నిహిత్యం డీసీసీ అధ్యక్ష పదవికి తనకు ప్రధాన బలంగా మారుతుందని ఆయన భావిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ పగ్గాల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నప్పటికీ... సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజా ఆమోదం, సేవా నిరతి మరియు పార్టీ పట్ల ఉన్న విధేయత దృష్ట్యా అధిష్ఠానం తనవైపే మొగ్గు చూపుతుందని నిరంజన్ రెడ్డి వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.