28 August, 2026 | 3:37 AM

మహిళల ఉపాధికి కొత్త అడుగు

28-08-2026 02:26 AM

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లి,ఆగస్టు 27 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో సీఎంసీ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటైన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గురువారం ప్రారంభించారు.

కార్యాలయ సిబ్బంది, సందర్శకులకు తక్కువ ధరకే పరిశుభ్రమైన అల్పాహారం, భోజనం అందించేందుకు ఈ క్యాంటీన్ ఏర్పాటైంది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహణ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు స్థిర ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, డీసీ సేవా ఇస్లావత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, సీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం క్యాంటీన్లో అందుబాటులో ఉన్న ఆహారాన్ని అతిథులు పరిశీలించారు.ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల నేతృత్వంలోని క్యాంటీన్లు విస్తరించడం ద్వారా ఆర్థిక స్వావలంబన పెరుగుతుందని అధికారులు వివరించారు. శేరిలింగంపల్లి జోన్లో ఇలాంటి సౌకర్యాలను మరిన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు సీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.