‘శ్రీశైలం’ నాలుగో యూనిట్‌కు టెండర్లు పిలవండి
- శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి) : షార్ట్ సర్క్యూట్‌తో మరమ్మతుకు గురైన శ్రీశైలం హైడల్ ప్రాజెక్టులోని నాలుగో యూనిట్ మరమ్మతు పనులకు తక్షణమే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క జెన్కో అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పరిధిలో పర్యటించిన అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇంధన శాఖ సీఎండీ ఎస్‌ఏ రిజ్వి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష కొనసాగించారు. రెండు కోట్ల రూపాయల ఖర్చుకు వెనకాడి రూ.60 కోట్ల విలువైన విద్యుత్‌ను కోల్పోవడం అర్థరహితమని పేర్కొన్నారు.
లెఫ్ట్‌బ్యాంక్ హైడల్ జెన్కో ప్రాజెక్టు తెలంగాణకు గర్వకారణమైందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే అవకాశం ఈ ప్రాజెక్టులో ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో 2020లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమని పేర్కొన్నారు. నాటి షార్ట్‌సర్క్యూట్ నుంచి యూనిట్‌ను కాపాడేక్రమంలో ప్రాణాలో కోల్పోయిన వారి కటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. గుండుసూది కదిలినా కనిపించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పుడు ప్లాంట్‌లో సీసీ కెమెరాల నిఘాతోపాటు ప్లాంట్‌లోకి వచ్చే ప్రతి మనిషికి చిన్నపాటి ఆక్సిజన్ సిలిండర్ వంటి భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిధులు సమస్య కాదని, మనిషి ప్రాణం విలువైందని స్వీపర్ నుంచి సీఈ వరకు ఇదే సూత్రం వర్తిస్తుందని పేర్కొన్నారు. టేయిల్ పాండ్, ఇతర మరమ్మతు పనులపై వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి సూచించారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్జిజన్ల రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు డిమోషన్ వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయని వీటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకష్ణ, మేఘారెడ్డి, కసిరెడ్ది నారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పర్ణికారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు
తెలంగాణలో రెప్పపాటు కూడా విద్యుత్ కోతలు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకున్నట్లు చెప్పారు. రుతు పవానాలు రాక ముందే శ్రీశైలం హైడల్ ప్రాజెక్టును సమీక్షించి తద్వారా పెద్దఎత్తున విద్యుత్ ఉత్పతికి కావాల్సిన చర్యలు చేపట్టడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. నాటి కాంగ్రెస్ పెద్దలు ముందుచూపుతో నిర్మించిన బహుళార్థక సార్థక ప్రాజెక్టుతో మన జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు.






