గనుల తవ్వకం, పర్యావరణ పరిరక్షణ రెండు కళ్లు
- కీలక ఖనిజాల రంగంలో విస్తృత అవకాశాలు
- దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారతాం
- 4వ విడత వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): అరుదుగా లభించే కీలకమైన ఖనిజాల వెలికితీతలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు విస్తృత అవకా శాలున్నాయని, అందుకే ఈ రంగంలో విడతలవారీగా సంస్కరణలు తీసుకొస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీ లో జరిగిన నాలుగో విడత కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల (క్రిటికల్ మినరల్) గనుల వేలాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్త గనుల చట్టం అమలులో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామ న్నారు.
రానున్న రోజుల్లో అన్ని ఖనిజాల వెలికితీతలో మొదటి స్థానంలో ఉండేందుకు కేంద్రం కృషి చేస్తుందని పేర్కొన్నా రు. గనులు తీసుకున్న వారు వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని, గనుల మంత్రిత్వ శాఖ 24/7 అండగా నిలబడుతుందని చెప్పారు. ‘గనుల తవ్వకం తోపాటు పర్యావరణ పరిరక్షణ రెండూ మాకు కీలకమైన అంశాలు. ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యాన్ని అందిస్తాం. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగేందుకు గనుల రంగంలో సాధించే ప్రగతి అత్యంత కీలకం. మోదీ వచ్చాకే రాష్ట్రాలకు అందాల్సిన.. వాటా సరిగ్గా అందుతోంది. ఒక్క ఒడిశాలోనే.. ఏడాదికి రూ.40వేల కోట్ల లబ్ధి చేకూరింది. రాష్ర్ట ప్రభుత్వాలు కూడా ఈ దిశగా సహకరించాలి. అన్ని భాగస్వామ్య పక్షాలు సహకరిస్తే ప్రతి 15 రోజులకో సంస్కరణ తీసుకొస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
దేశీయ అవసరాల కోసం ఇంకా దిగుమతిపైనే ఆధారం
కీలకమైన ఖనిజాలను మనం అనుకున్నంతగా వెలికితీయలేకపోయామని.. రాగి వంటి ఖనిజాలను మన దేశీయ అవసరాలకోసం దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఈ దిశగా ప్రత్యేకమైన దృష్టి సారించి భవిష్యత్తులో ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతామనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ‘స్కీమ్ ఫర్ పార్షియల్ రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ ఎక్స్‌పెన్సెస్ ఫర్ హోల్డర్స్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ లైసెన్స్’ పుస్తకాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించారు.
అనంతరం 2 కంపెనీలకు మైనింగ్ ఎక్స్ ప్లొరేషన్ లైసెన్స్‌లను, ఈ రంగంలో మంచి ఫలితాలు సాధిస్తున్న కంపెనీలు, సంస్థలకు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్రదూబే, గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, అదనపు కార్యదర్శి సంజయ్ లోహియా, గనుల రంగ ప్రముఖులు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు, పరిశోధన సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






