5 July, 2026 | 12:14 PM

ఇంకెన్నేళ్లు ఈ నిరీక్షణ

23-05-2024 01:00 AM

విజయక్రాంతి, ఖేల్ విభాగం: ‘విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడితే చూడాలని ఉంది’ గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా ఇదే మాట. తాజా ఆటగాళ్లు, మాజీ ప్లేయర్లు, సహచరులు, ప్రత్యర్థులు, విశ్లేషకులు, నిపుణులు ఇలా ఒక్కరేంటీ అందరూ కోహ్లీని కప్పుతో చూడాలని కలలు కన్నారు. అందుకు తగ్గట్లే ప్లే ఆఫ్స్ చేరడం అసాధ్యమనుకున్న దశలో ఆర్సీబీ వరుస విజయాలతో అదరగొట్టి ఎలిమినేటర్‌కు అర్హత సాధించింది. ఇంకో మూడడుగులు వేస్తే తొలి ట్రోఫీ చేజిక్కుతుందన్న తరుణంలో బెంగళూరుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లీగ్ దశ చివరి ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి.. ఇప్పటికే నాకౌట్ ఒత్తిడిని అధిగమించినట్లు కనిపించిన ఆర్సీబీ కీలకపోరులో తేలిపోయింది.

అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో ఆకట్టుకోలేక చేతులెత్తేసింది. అన్నీ తానై నడిపించిన విరాట్ ఎలిమినేటర్ పోరులో త్వరగా పెవిలియన్ చేరడం టీమ్‌కు గట్టి షాక్ కాగా.. 17 ఏళ్ల నిరీక్షణ అలాగే కొనసాగింది. దేశంలోని ఏ మూల మ్యాచ్ జరిగినా.. పెద్ద సంఖ్యలో చేరిపోయే బెంగళూరు అభిమానులు మరోసారి ఉసూరుమనగా.. మైదానంలో సర్వశక్తులు ధారపోసిన రన్‌మెసీన్ విరాట్ కోహ్లీకి నిరాశ తప్పలేదు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ‘అసలు విరాట్ పొట్టి ఫార్మాట్‌కే పనికిరాడు.. అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయడం దండగ’ అని అన్న విశ్లేషకులు సైతం.. 17వ సీజన్‌లో కోహ్లీ గణాంకాలు చూసి నోరెళ్లబెట్టారు.

వరల్డ్‌కప్‌నకు ఎంపికైన ఇతర భారత ఆటగాళ్లంతా లయ అందిపుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలో.. విరాట్ ఒంటరిగా ఆర్సీబీ నావను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన కోహ్లీ 61.75 సగటుతో 741 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లీగ్‌కు ముందు కోహ్లీ స్ట్రయిక్‌రేట్‌పై విపరీత చర్చ జరగగా.. అతడు 154.69 స్ట్రయిక్‌రేట్‌తో ఈ పరుగులు చేయడం మరో విశేషం. ఇందులో ఒక సెంచరీ నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌండ్రీలు మాత్రమే బాదగలడు.. సిక్సర్లలో కోహ్లీ కాస్త వీక్ అన్న వారికి ఈ సీజన్‌లో 38 భారీ సిక్సర్లతో విరాట్ గట్టిగా బదులిచ్చాడు.

మైదానంలో భావోద్వేగాలను దాచిపెట్టుకోకుండా.. సహచరులను ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకుంటే సాగే విరాట్.. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో మరే ఆటగాడికీ సాధ్యం కాని రీతిలో 8 వేల పరుగుల మైలురాయి దాటిన విరాట్‌కు.. ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షలానే ఊరిస్తోంది. మరి వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగనుండగా.. ఈసారైనా బెంగళూరు మరింత మెరుగైన ఆటగాళ్లను కొనుగోలు చేసుకుంటుందా చూడాలి.

‘ఒక్క శాతం అవకాశం ఉన్న చాలు. దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మునిగిపోతున్న వారికి చిన్న తాడు సాయం చాలు’ అని స్ఫూర్తివంతమైన మాటలతో.. ప్లే ఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోయిన దశలో జట్టులో జవసత్వాలు నింపి ఇక్కడి వరకు తీసుకొచ్చిన కోహ్లీ కప్పు మాత్రం కైవసం చేసుకోలేకపోయాడు. డబ్ల్యూపీఎల్లో బెంగళూరు మహిళల జట్టు విజేతగా నిలవడంతో.. పురుషుల జట్టు కూడా ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకొని సత్తాచాటుతుందని ఆశలు పెట్టుకున్న అభిమానులు మరో ఏడాది కోసం ఎదురు చూడక తప్పదు!