బెంగ తీరలేదు!
ఎలిమినేటర్‌లో ఆర్సీబీ ఓటమి
రాజస్థాన్ రాయల్స్ ముందంజ
ఐపీఎల్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు.
అదే కథ, అదే వ్యథ!
ఈ ఏడాది కూడా బెంగళూరు కల నెరవేరలేదు!!
ఎప్పట్లాగే ‘ఈ సాల కప్ నమ్‌దే’ అంటూ బరిలోకి దిగిన బెంగళూరు.. ట్రోఫీ చేజక్కించుకోకుండానే ఇంటిబాట పట్టింది. ఐపీఎల్ ఆరంభం నుంచి కప్పు రేసులో ప్రధాన పోటీదారుగా కొనసాగుతున్న బెంగళూరుకు 17వ సీజన్‌లోనూ నిరాశ తప్పలేదు!
లీగ్ దశ చివర్లో అనూహ్య విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్‌లో అదే ప్రదర్శన పునరావృతం చేయలేకపోయింది. గత ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి ఫుల్ జోష్‌లో బరిలో దిగిన డుప్లెసిస్ సేన.. కీలక మ్యాచ్‌లో తేలిపోయింది. సీజన్ ఆసాంతం బ్యాటింగ్ భారాన్ని మోసిన విరాట్ కోహ్లీ ఎలిమినేటర్‌లో త్వరగా పెవిలియన్ చేరడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపింది!!
డుప్లెసిస్ నిరాశ పర్చగా.. నాకౌట్ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మొదట బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. మిగిలినవాళ్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బౌల్ట్ వికెట్ల పతనానికి తెరలేపితే.. పాతకాపు అశ్విన్ పకడ్బందీ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ఛేదనలో జైస్వాల్, పరాగ్ రాణించడంతో రాజస్థాన్ క్వాలిఫయర్ అర్హత సాధించింది!
అహ్మదాబాద్: బెంగళూరు జోరుకు రాజస్థాన్ అడ్డుకట్ట వేసింది. వరుసగా ఆరు విజయాలు సాధించి నాకౌట్ దశకు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు రాజస్థాన్ రాయల్స్ చెక్ పెట్టింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించి క్వాలిఫయర్ అర్హత సాధించింది. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడి కాస్త ఒత్తిడిలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన రాయల్స్.. కీలక సమయంలో సమష్టిగా సత్తాచాటి ఫలితం రాబట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, ఒక సిక్సర్), మహిపాల్ లోమ్రర్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) గోల్డెన్ డకౌట్ కాగా.. కెప్టెన్ డుప్లెసిస్ (17), దినేశ్ కార్తీక్ (11) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 45; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. రియాన్ పరాగ్ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (17), ధ్రువ్ జురెల్ (8) ఎక్కువసేపు నిలవలేకపోగా.. ఆఖర్లో హెట్‌మైర్ (26; 3 ఫోర్లు, ఒక సిక్సర్), రావ్‌మన్ పావెల్ (16 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, గ్రీన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. శుక్రవారం జరగనున్న ఎలిమినేటర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఆద్యంతం తడబడుతూనే..
కీలక పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆకట్టుకోలేకపోయింది. రెండో ఓవర్‌లో కోహ్లీ ఫోర్‌తో బౌండ్రీల ఖాతా తెరవగా.. ఆ వెంటనే డుప్లెసిస్ ఓ సిక్స్ అందుకున్నాడు. నాలుగో ఓవర్లో ఈ ఇద్దరు కలిసి 6,4,4 బాదడంతో బెంగళూరు బ్యాటింగ్ సజావుగానే సాగింది. ఆ మరుసటి ఓవర్‌లో పావెల్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కు డుప్లెసిస్ పెవిలియన్ బాట పట్టగా.. అక్కడి నుంచి బెంగళూరు వరస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అడపా దడపా బౌండ్రీలు బాదిన కోహ్లీని చాహల్ బుట్టలో వేసుకోవడంతో ఆర్సీబీ కష్టాలు మరింత పెరిగాయి. కాసేపటికి కామెరూన్ గ్రీన్ (27), రజత్ కుదురుకున్నట్లు కనిపించడంతో ఇక మీదైన స్కోరు బోర్డు వేగం పుంజుకుంటుందనుకుంటే అదీ అత్యాశే అయింది. కట్టుదిట్టమైన బంతులతో పరుగలకు అడ్డుకట్ట వేసిన స్పిన్నర్ అశ్విన్ తన స్పెల్ చివరి ఓవర్‌లో బెంగళూరుకు భారీ దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో గ్రీన్, మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేశాడు. దినేశ్ కార్తీక్‌కు ఎక్కువ బంతులు ఆడే అవకాశం లభించిన దాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివర్లో లోమ్రర్ కీలక విలువైన పరుగులు చేశాడు.
జైస్వాల్, పరాగ్ బాధ్యతాయుతంగా..
సాధారణ లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. యష్ దయాల్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో జైస్వాల్ నాలుగు ఫోర్లతో విజృంభించగా.. మరుసటి ఓవర్‌లో టామ్ కాడ్మోర్ రెండు ఫోర్లు అరుసుకున్నా డు. ఫలితంగా 5 ఓవర్లు ముగిసే సరి కి రాయల్స్ 45 పరుగులు చేసింది. తదుపరి ఓవర్‌లో ఫెర్గూసన్ ఆర్సీబీకి తొలి వికెట్ అందించగా.. శాంస న్ ఎక్కువసేపు నిలువలేకపోయాడు. మంచి టచ్‌లో కనిపించిన జైస్వాల్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. సంజూను కార్తీక్ స్టంపౌట్ చేశాడు. జురెల్ రనౌట్ కాగా.. పరాగ్ మరోసారి తన విలువ చాటుకున్నాడు. ఈ సీజన్‌లో భిన్నమైన క్రికెట్ ఆడుతున్న పరాగ్.. ప్రధాన ఆటగాళ్ల వైఫల్యాన్ని మైమరిపిస్తూ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో కట్టిపడేశాడు. చెత్త బంతులను బౌండ్రీలకు తరలిస్తూ జట్టును విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో హెట్‌మైర్, పావెల్ మిగిలిన పని పూర్తి చేశారు.






