13 June, 2026 | 12:59 AM

మెడిసిన్ కౌన్సెలింగ్‌లో అక్రమాలను అరికట్టాలి

13-06-2026 12:26 AM
  1. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 
  2. జీవో నెంబర్ 550 అమలుపై వైద్యారోగ్య శాఖ మంత్రితో చర్చ

ముషీరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): త్వరలో జరగబోయే మెడికల్ కౌన్సిలింగ్ లో జీవో నెంబర్ 550 ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం త్వరలో జరగబోయే మెడిసిన్ కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలులో అక్రమాలు,  అవకతవకలు జరగకుండా అరికట్టాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యక శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్ సిఫార్సుల ప్రకారం జీవో నెంబర్ 550 జారీ చేశారని,  దీనిని 20 సంవత్సరాలు అమలు చేశారు కానీ కొందరు అధికారులు 2019లో ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టించి మరో కొత్త జీవో నెంబర్ 114 తెచ్చి ఈ వర్గాలకు అన్యాయం చేస్తున్నారన్నారు.

పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 550 జీవో ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, కేవలం మన రాష్ట్రంలోనే ఉద్దేశం పూర్వకంగా బీసీలను అణిచివేతలో భాగంగా అన్యాయంగా కొత్త జీవో తెచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు లో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో ఉన్నత స్థాయి సమావేశం చేసి అధికారులు బీసీ కమిషన్ ఎస్టీ కమిషన్ చైర్మన్లు ఏర్పాటు చేసి జీవో నెంబర్ 550 అమలు చేస్తామన్నారు.

ఈ చర్చలలో రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర బీసీ అధ్యకులు జిల్లపల్లి అంజి, బీసీ రాష్ట్ర విద్యార్ధి సంఘం కన్వీనర్ పర్లగోర్ల మోడీ రాందేవ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు జి.  అనంతయ్య, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు రాజేందర్, బీసి విద్యార్థి సంఘం నాయకులు ప్రీతం, నాగరాజు, బలరాం తదితరులు పాల్గొన్నారు.