కొల్లాపూర్‌కు పట్టిన శని.. మంత్రి జూపల్లి కృష్ణారావే..
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
కొల్లాపూర్ రూరల్, జూన్ 12 (విజయక్రాంతి): కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్లక్ష్యం చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కొల్లాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)పై నిర్వహించిన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ స్పోరట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ మెట్టు శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పలు మార్లు మంత్రి పదవులు అనుభవించారని అయినా కొల్లాపూర్ అభివృద్ధి శూన్యంగా మారిందన్నారు. వనపర్తి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే జిల్లాను అభివృద్ధి చేశామని, కానీ కొల్లాపూర్ ప్రజలు పలుమార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం గత పాలకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు అదే నాయకులు పాలనలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. 2002 తర్వాత ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పార్టీ నాయకులు జాగ్రత్తగా పరిశీలించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హనుమంతు నాయక్, మాజీ జడ్పీటీసీ కాటం జములయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






