8 August, 2026 | 2:14 AM

వట్టి వాగు ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని విడుదల చేయాలి

08-08-2026 01:07 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని వట్టి వాగు ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ డీఈ కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులో నీరు చేరడం ఆలస్యమైందని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి నీటితో నిండిందన్నారు. ఇప్పటికే రైతులు వరి నార్లు పోశారని, అయితే సాగునీటిని విడుదల చేయకపోవడంతో నార్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు ఇతర ఆరుతడి పంటలకు అనుకూలంగా లేవని, అధికారులు తక్షణమే స్పందించి ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేస్తే రైతులు వరి సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు గాజుల జక్కయ్య, మేకర్తి కాశయ్య, మిట్ట తిరుపతి, గడ్డల శంకర్, అడప సతీష్, మనిగొండ వెంకటేష్, గడ్డల సురేష్, పొలంపల్లి గణపతి, మిట్ట పోషణ, రుకుం ప్రహ్లాద్, పెద్దపల్లి శంకర్, బుసి భీమేష్ తదితరులు పాల్గొన్నారు.