8 August, 2026 | 2:13 AM

తక్షణమే జోక్యం చేసుకోండి

08-08-2026 01:08 AM
  1. తెలంగాణ న్యాయమైన నీటి హక్కులను కాపాడండి
  2. కేంద్ర అనుమతులపై జీఆర్‌ఎంబీ సమీక్షించడమేంటి?
  3. అజెండాలోని అంశాలను వెంటనే ఉపసంహరించుకోవాలి
  4. జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఏపీ పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 85 కింద తక్షణమే జోక్యం చేసుకుని, తెలంగాణ రాష్ట్ర న్యాయమైన నీటి హక్కులను కాపాడాలని కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కి మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభు త్వం నుంచి అన్ని రకాల అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు పొందిన తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశా న్ని జీఆర్‌ఎం బీ సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ మేరకు శుక్రవారం కేంద్ర జల్ శక్తి మంత్రికి, సెక్రటరీకి లేఖ రాశారు. త్వర లో జరగబోయే గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) 18వ సమావేశం ఎజెండాలో పొందుపరిచిన పలు అంశాలను తక్షణమే ఉప సంహరించుకునేలా ఆ బోర్డును ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని పలు భారీ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటికే మంజూ రు చేసిన చట్టబద్ధమైన అనుమతులను మళ్లీ సమీక్షించేలా ఈ ఎజెండాను రూపొందించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అత్యున్నత సంస్థల అధికారాలు, వాటి విశ్వసనీయతకు సంబంధించిన సున్నితమైన అంశమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, హైడ్రోలాజికల్, ఇంజనీరింగ్, పర్యావరణ, చట్టపరమైన అంశాలను కేంద్ర జల సంఘం, జలశక్తి మంత్రిత్వ శాఖలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే టెక్నిక ల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు.

దీంతో మళ్లీ సమీక్షించే లేదా రద్దు చేసే అధికారం గోదావరి బోర్డు లాంటి కిందిస్థాయి సంస్థకు ఏమా త్రం ఉండదన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను మళ్లీ సమీక్షించేందుకు జీఆర్ ఎంబీకి అవకాశం ఇస్తే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాధాన్యతను తగ్గించినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కీలక ప్రాజెక్టులకు సుదీర్ఘ ప్రక్రియ తర్వాతే అనుమతులు వచ్చాయని తెలిపారు. ఇప్పుడు వాటిని మళ్లీ సమీక్షించాలని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు.

సీడబ్ల్యూసీ ఇప్పటికే ఈ ప్రాజెక్టుల అంశాలను లోతుగా పరిశీలించినందున, పరోక్ష పద్ధతుల ద్వారా వీటిని మళ్లీ తెరపైకి తీసుకురావడం సబబు కాదని వెల్లడించారు. సమ్మక్కసాగర్ మిగిలిన అనుమ తులను త్వరగా మంజూరు చేయాలన్నారు. కేంద్రం ఇచ్చిన అనుమతులను మళ్లీ సమీక్షించేలా అవకాశం ఇస్తే, భవిష్యత్తులో ఇచ్చే జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ  అనుమతిపై అనిశ్చితి ఏర్పడుతుందన్నారు.