6 August, 2026 | 1:39 AM

అతను మొజ్తాబానేనా?

06-08-2026 12:42 AM

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో  సుప్రీం లీడర్ రహస్య భేటీపై సందేహాలు

టెహ్రాన్, ఆగస్టు 5: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఇరాన్ సుప్రీం లీడర్ మొజాబా ఖమేనీ రహస్యంగా, చీకట్లో భేటీ కావాల్సిన అవసరం ఏంటి? ఎదురుగా ఉన్న మనిషికి కనబడనంత అంధకారంలో ఎందకు ఉన్నారు? ఒకరిమాట ఇంకొకరు వినగలిగేలా మాత్రమే ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? వీరు కరచాలనం కూడా చేసుకోలేదా? ఇలా ప్రశ్నల పరంపరంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారా..? టెహ్రాన్ అధ్యక్షుడు మసూద్‌తో సమావేశం అయింది అసలు మొజ్తాబాబా ఖమేనీనేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్-, అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడినప్పటి నుంచి మొజ్తాబా బహిరంగంగా కనిపించకపోవడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది.

ఇరాన్ ఐఆర్‌జీసీ దళాల తీరుపై అసంతృప్తితో ఉన్న పెజెష్కియాన్ రాజీనామా చేస్తానని ఇటీవల హెచ్చరించారు. ఈ క్రమంలోనే సుప్రీం లీడర్ మొజ్తాబాతో ఆయన సమావేశం కావడం కీలకంగా మారింది. టెహ్రాన్‌లోని అత్యంత రహస్య ప్రాంతంలో వీరి సమావేశం జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ముదురు రంగు అద్దాలున్న కారులో వెనక సీట్లో మొజ్తాబా ఖమేనీతో.. పెజెష్కియాన్ భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఎదురుగా ఉన్న మనిషి కనబడనంత చీకట్లో ఈ సమావేశం జరిగినట్లు మీడియా కథనాలు తెలిపాయి. వీరు కరచాలనం కూడా చేసుకోలేదని తెలుస్తోంది. దీంతో పెజెష్కియాన్‌ను కలిసింది అసలు మొజ్తాబాయేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజీనామా హెచ్చరికలు, భేటీ కోసం పెజెష్కియాన్ పలుమార్లు చేసిన అభ్యర్థనల నేపథ్యంలో ఈ సమావేశానికి మొజ్తాబా అంగీకరించారు. సాధారణంగా ఇలాంటి భేటీ సుప్రీం లీడర్ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. అయితే ఈ సమావేశం రహస్య ప్రాంతంలో జరిగింది. కొన్ని నిమిషాల పాటు వీరిద్దరి సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఖమేనీ భద్రతా సిబ్బంది పెజెష్కియాన్‌కు చెప్పినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

ఆయన మొజ్తాబా ముఖాన్ని చూడలేకపోయారు. ఒకరిమాట ఇంకొకరు వినగలిగేలా మాత్రమే ఈ భేటీని ఏర్పాటు చేశారని వెల్లడించాయి. సుప్రీం లీడర్ ప్రవర్తనను పెజెష్కియాన్ అవమానంగా భావించారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో సమావే శమైంది సుప్రీం లీడర్ మొజ్తాబానేనా? ఆయన బతికే ఉన్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇరాన్ పాలన ఐఆర్‌జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నట్లు పెజెష్కియాన్ తన రాజీనామా లేఖలో హెచ్చరించారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే తన మాటల్లో మొజ్తాబా ఖమేనీ 90శాతం చనిపోయినట్లేనని పేర్కొనడం గమనార్హం.