జీవో ఇచ్చారు.. అప్పగింత మరిచారు
- ఎల్లమ్మ బండ పాఠశాలకు 4.20 ఎకరాల భూమి కేటాయింపు
- ఇప్పటివరకు అప్పగించిన వైనం
- పాఠశాలలో 1100 మంది విద్యార్థులు
- ఇరుకు గదుల్లోనే విద్యా బోధన
కూకట్‌పల్లి, ఆగస్టు 5 (విజయక్రాంతి ):పాఠశాలకు స్థలం కేటాయిస్తూ ప్రభుత్వ జీవో ఇచ్చినప్పటికీ విద్యాశాఖకు ఆ స్థలాన్ని అప్పగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కూకట్పల్లి మండల పరిధి ఎల్లమ్మబండ లోని ప్రభుత్వ పాఠశాల 2009 సంవత్సరంలో 8వ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యా బోధనను ప్రారంభించారు. సమీప ప్రాంతాలలో మధ్యతరగతి, పేదవాళ్లే అధికంగా నివాసం ఉండడంతో ఈ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యార్థులకు తరగతి గదులు సరిపోకపోవడంతో ఇరుకు గదుల్లో విద్యాబోధన చేయలేక పాఠశాల ఆవరణలో సైతం విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు.
ఈ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు విద్యాబోధన నిర్వహిస్తున్నారు. ప్రీ ప్రైమరీ నుండి పదవ తరగతి వరకు నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో 1100 మంది పేద విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 1100 మంది విద్యార్థులు విద్యనభ్యసించడానికి సరైన వసతులు లేక ఇరుకు గదులతో,అరకొర మౌలిక వసతుల తో పాఠశాల సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పదవ తరగతి వరకు నిర్వహించబడుతున్న .
ఈ పాఠశాలకు సరిపోయేంత స్థలం లేకపోవడంతో సమస్యను పరిష్కరించడంలో భాగంగా ప్రభుత్వం ఎల్లమ్మబండలోని జేఎన్‌ఎన్యూఆర్‌ఎం గృహాల సముదాయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలము సర్వే నంబర్ 336లో 4 ఎకరాల 20 గుంటల స్థలాన్ని 2022 సంవత్సరంలో రెవెన్యూ అధికారులు కేటాయించింది. రెవెన్యూ అధికారులు అధికారికంగా ప్రభుత్వ జీవో ఇచ్చినప్పటికీ విద్యాశాఖ అధికారులకు ఈ స్థలం పై పొజిషన్ ఇవ్వకపోవడంతో విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు.
దీన్ని ఆసరాగా చేసుకుని సమీప కాలనీవాసులు ఆ స్థలం పక్కనే మహంకాళి మందిరం ఉందంటూ ఆ స్థలం లో ఎలాంటి స్కూలు నిర్మాణం చేపట్టొద్దు అంటూ పాఠశాల హెడ్ మాస్టర్ కి కోర్టు నోటీసులు పంపించారు. అట్టి స్థలంలో ఈ స్థలం మహంకాళి మందిరానికే చెందినదంటూ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వము పాఠశాలకు స్థలం కేటాయించిన సమయంలో సి ఎస్ ఆర్ నిధులతో హెచ్‌ఎఎల్ కంపెనీ పాఠశాల భవన నిర్మాణానికి ముందుకు వచ్చింది. కానీ స్థలంలో వివాదం ఉండడం, పక్క కాలనీవాసులు అట్టి స్థలం మందిరానిదంటూ పాఠశాల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు.ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి ఎలాంటి సానుకూలత లభించకపోవడంతో హెచ్ ఏ ఎల్ కంపెనీ వారు వెనక్కి తగ్గారు.
కబ్జాదారుల కన్ను
కేపీహెచ్బీ కాలనీ నుండి ఉషా ముల్లపూడి ఆసుపత్రి మార్గంలోని రహదారిపై ఈ స్థలం ఉండడంతో కబ్జాదారుల కన్ను కోట్లు విలువ చేసే ఈ స్థలం పై పడినట్లు తెలుస్తుంది. స్థానిక నాయకుల అండదండలతో గుడుల పేరుతో ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ స్థలము సర్వేనెంబర్ చివరిలో ఉండడంతో పక్క సర్వే నంబర్ వేసి కొంతమంది భూ బకాసురులు కబ్జా చేసుకునే యత్నంలో ఉన్నట్లు కాలనీవాసులు అనుకుంటున్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఈ స్థలాన్ని ప్రభుత్వం విద్యా శాఖకు అప్పగించినప్పటికీ స్థలంలో పాఠశాల నిర్మాణం జరగపోవడానికి కారణం ఏంటని, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ సమస్య జటిలము అవ్వడానికి కారణం రెవెన్యూ శాఖలోపమా, విద్యాశాఖ నిర్లక్ష్యమా లేక మరేదైనా కారణం ఉందా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి పాఠశాల నిర్మాణానికి చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఈ స్థలంలోనే నిర్మించాలి
ప్రభుత్వం కేటాయించిన స్థలంలోపాఠశాల భవన నిర్మాణం కోసం కృషి చేయకుండా స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కోసం 5 ఎకరాల స్థలము కేటాయించాలని ముఖ్యమంత్రి కి వినతి పత్రం ఇవ్వడం ఎంతవరకు సబబు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో పాఠశాలల నిర్మిస్తే సమీపంలో నివసిస్తున్న ఎంతోమంది నిరుపేదలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడాలన్న ఆలోచన స్థానిక ఎమ్మెల్యేకు, మాజీ కార్పొరేటర్ కు లేదు. ఇట్టి స్థలంలో పాఠశాల భవనాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి పలుమార్లు వినతి పత్రం ఇచ్చాను, అయినప్పటికీ అధికారులు ఎలాంటి ని స్పందన రావడం లేదు.
కేశవరావు ( బిజెపి నాయకులు)






