9 March, 2026 | 10:50 PM

ప్రజాధనంతో ప్రచారమా?

09-03-2026 02:37 AM
  1. తెలంగాణ ఖజానాలో రూ.కోట్లు దుబారా 
  2. సీఎం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటు 
  3. యుద్ధం విషయంలో కాంగ్రెస్ భయాన్ని సృష్టిస్తోంది 
  4. బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు ఉండదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందంటూ ప్రతిరోజూ కథలు చెబుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఇక్కడి ప్రజాధనంతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. ఇది ప్రతిఒక్కరూ ఖండించాల్సిన విషయమన్నారు. కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం కోసం ఫుల్ పేజ్ కలర్ యాడ్స్ ఇస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, కేరళలో మాత్రం ఆర్భాట ప్రచారం చేయడం

తెలంగాణ ప్రజలను అవమానించే చర్య అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ నేతలు పలువురు రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లా డుతూ.. బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ దేశ ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఇరాన్, యూఎస్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్‌లో ఎక్కడా క్రూడ్ ఆయిల్ కొరత లేదని, ఒకే దేశంపై ఆధారపడకుండా వ్యూహాత్మకంగా అనేక దేశాల నుంచి భార త్ ఆయిల్ సరఫరా పొందుతోందన్నారు. యూపీఏ హయాంలో భారత్ కేవలం 16 దేశాల నుంచి మాత్ర మే ఆయిల్ దిగుమతి చేసుకునేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆ సంఖ్యను 40 దేశాలకు పెంచామని, ఇది పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయమన్నారు.

మహిళలకు గ్యాస్ సిలిండర్ ధరలపై ఎటువంటి ప్రభావం ఉండదని, దేశంలో తగినంత బఫర్ స్టాక్ ఉందని, ఇంపోర్ట్ కవరేజ్ కూడా పెరిగిందన్నారు. డిసెంబర్ 2025లో ముడిచమురు దిగు మతులు గత ఏడాదితో పోలిస్తే 6.9 శాతం పెరిగి 20.20 మిలియన్ టన్నులకు చేరాయని, ఇది ఎన్డీఏ ప్రభుత్వ సరఫరా వ్యవస్థ బలంగా ఉందని చూపిస్తోందని పేర్కొన్నారు.   

రాష్ట్రపతిని గౌరవించరా?

దేశ రాష్ట్రపతిని గౌరవించకుండా, ప్రొటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. 2012లో ఇరాన్ భారత్‌కు ఆయిల్ సరఫరా నిలిపివేసిందని, దీనికి కారణం 2005లో యూపీఏ ప్రభుత్వం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడమే అన్నారు. ఆ నిర్ణయం భారత్-ఇరాన్ సంబంధాలను దెబ్బతీసిందని, దాంతో క్రూడ్ ఆయిల్ దిగుమ తులు తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు. 2012-13లో ఇరాన్‌పై ఆంక్షలు విధించిన తర్వాత భారత్‌కు వచ్చే ఆయిల్ దిగుమతులు సుమారు 26.5 శాతం వరకు పడిపోయాయని తెలిపారు.

ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత యూపీఏ ప్రభుత్వానిదేనని, కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు ఇరాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ, భారతదేశంలో చమురు కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారననారు. ప్రపంచంలో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ వినియోగ దేశాల్లో భారత్ ఒకటి... అందుకే ఎనర్జీ సెక్యూరిటీ భారత విదేశాంగ విధానంలో అత్యంత కీలక అంశంగా ఉందన్నారు. భారత్... రష్యా, ఇజ్రాయిల్, యూఎస్ వంటి అనేక దేశాలతో మైత్రి సంబంధాలను కొనసాగిస్తోందని, కానీ యూపీఏ హయాంలో సరైన వ్యూహం లేకపోవడం వల్ల అనేక అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు.

చైనాతో కూడా సరైన ధైర్యంతో వ్యవ హరించలేకపోయారని, దాని ఫలితంగా భారత సరిహద్దుల్లో తరచూ చిన్న చిన్న ఘటనలు జరిగేవ న్నారు. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ తప్పుడు ప్రచా రం మానుకోవాలని, అబద్ధాలు చెప్పి దేశ ప్రజలను భయాందోళనలకు గురి చేయకూడదన్నారు. అంతర్జాతీయంగా పెద్ద సంఘర్షణ పరిస్థితి ఉన్నప్పటికీ భారత్‌లో ఎలాంటి భయం లేకుండా ఇంధన ధరలు స్థిరంగా ఉండటం ప్రధాని మోదీ నాయకత్వానికి నిదర్శనమన్నారు.  ఇది దూరదృష్టి ఉన్న నాయకత్వానికి నిదర్శనమని, ఇది బలమైన దౌత్యం.. ఇవన్నీ వికసిత్ భారత్ వైపు వేగవంతమైన అడుగులన్నారు. అందుకే మహిళలు, యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు.