9 March, 2026 | 10:50 PM

30నెలల్లో పాలమూరు పూర్తి

09-03-2026 02:33 AM

2027 మార్చి నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ కూడా..

  1. ప్రాజెక్టుల భూసేకరణకు జూన్ 2నాటికి రూ. 5వేల కోట్లు 
  2. జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల పెరిగిన లిఫ్ట్ ఖర్చులు 
  3. జూరాల డీసిల్టింగ్ పనులు వెంటనే ప్రారంభించాలి
  4. నీటి పారుదల శాఖ -మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి) : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 30 నెలల వ్యవధిలో పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశా రు. అదే విధంగా 2027 మార్చి నెల వరకు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సమృద్ధి గా సాగు నీరు, తాగు నీరు అందిస్తామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాతో సహా దక్షిణ తెలంగాణ ప్రాంత రైతాంగానికి సరిపడా సాగు నీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలసి ఆయన సమీక్ష నిర్వహిం చారు. నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యానాథ్ దాస్, ప్రధానకార్యదర్శి ఈ శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్‌తో సహా నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాణంలో ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని, కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టెంపాడుకు రూ.252 కోట్లు, భీమా ప్రాజెక్టుకు రూ.200కోట్లు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు రూ.185 కోట్లు కేటాయింపులు జరిగాయని వివరించారు. అదే సమయం లో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ప్రాజె క్టుల కు అవసరమైన భూసేకరణ, పునరావాస పనులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు భూసేకరణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ జూన్ 2నాటికి 5000 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైయ్యయని విమర్శించారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో ఆఫ్టేక్ పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల లిఫ్ట్ ఖర్చులు పెరిగి రాష్ట్రానికి నష్టం కలిగిందన్నారు. ఇదే తరహాలో కాలేశ్వరం లిఫ్ట్ ఎత్తిపోతల పథకాన్ని తుమ్మి డి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం తెలంగాణ రైతులకు అన్యాయం జరిగేలా చేసింద ని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ..

రైతులకు వాగ్దానం చేసిన సాగునీటి ప్ర యోజనాలను అందించడానికి ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటా యిస్తుందని తెలిపారు. అన్ని చర్యలు చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉంటాయని స్పష్టం చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని రైతులకు విశ్వసనీయ నీటి సరఫరా, అధిక దిగుబడులు, ప్రత్యక్ష ఆర్థిక మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.  పాలమూరు- రం గారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.35,200 కోట్ల పరిపాలన అనుమతి తీసుకున్నప్పటికీ, రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి పనులను నిర్లక్ష్యంగా వదిలేసిందని విమర్శించారు. 2023 సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్టులో ఒక పంపును కేవలం ఒక గంట మాత్రమే నడిపి, ఒక్క ఎకరానికి కూడా సమర్థంగా నీరు అందించ లేకపోయారన్నారు.

ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.55,000 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ నిర్మాణ వ్యయం కలిపితే మొత్తం వ్య యం రూ.80,000 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. 2023 డిసెంబర్ 7నుంచి ఇప్పటివరకు పాలమూ రు- రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.7,161 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రాజెక్టు పనులకు రూ.6718 కోట్లు, భూసేకరణకు రూ.284.71 కోట్లు, పునరావాసాని కి రూ.63.65 కోట్లు, ఇతర ఖర్చులకు రూ. 94 కోట్లు వినియోగించినట్లు వెల్లడించారు.

జూరాల ప్రాజెక్టు డీసిల్టింగ్..

జూరాల (ప్రియదర్శిని జూరాల) ప్రాజెక్టులో వెంటనే డీసిల్టింగ్ పనులు ప్రారంభిం చాలని మంత్రి నీటిపారుదల అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో దాని స్థూల నిల్వసామర్థ్యం 11.94 టీఎంసీలుగా ఉండగా, మట్టిపొరలు పేరుకుపోవడం వల్ల ప్రస్తుతం ప్రభావవంతమైన సామర్థ్యం సుమారు 9టీఎంసీలకు తగ్గిందని తెలిపారు. 1995లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో గత మూడు దశాబ్దాలుగా సహజంగా పేరుకుపోయిన మట్టి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రాజెక్టు నుంచి తవ్వి తీసే ఇసుకను గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టు పనులకు ఉపయోగించే అవకాశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. తెలంగాణకు కృష్ణా నదిపై ఉన్న హక్కులను పూర్తిగా వినియోగించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.  గత ఖరీఫ్ సీజన్‌లో 148.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నమోదు కాగా, కనీస మద్దతు ధర కొనుగోలు ద్వారా సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో సుమారు రూ. 20,000 కోట్లు జమ చేసినట్లు వివరించారు.