28-06-2025 12:13:32 AM
సినిమా: కన్నప్ప
నటీనటులు: మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్, శరత్‌కుమార్, మధుబాల, ముఖేశ్ రిషి, బ్రహ్మానందం, సప్తగిరి, శివబాలాజీ తదితరులు
సంగీతం: స్టీఫెన్ దేవసి
కెమెరా: షెల్డన్ చావ్
ఎడిటర్: ఆంటోనీ
బ్యానర్: అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నిర్మాత: మోహన్‌బాబు
దర్శకత్వం: ముఖేశ్‌కుమార్ సింగ్
విడుదల: 27 జూన్, 2025
పరమ శివుడి పరమ భక్తుడు కన్నప్ప గురించి దక్షిణాది ప్రేక్షకులకు తెలియనిది కాదు. అయితే, వాస్తవ కథకు మరికొంత కల్పితాన్ని జోడించి తెరమీదకు తెచ్చిన ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందంటే..
కథ ఏంటంటే?:
ఒక గూడెం పెద్ద నాథునాథుడు (శరత్‌కుమార్) కొడుకే బాల తిన్నడు (అవ్రామ్ మంచు). ఆచారం అంటూ గూడెం పెద్దల చేసిన అమానవీయ ఘటనతో చలించిపోయిన తిన్నడు అప్పట్నుంచి నాస్తికుడిగానే పెరుగుతాడు. పెద్దయ్యాక తిన్నడు (మంచు విష్ణు) గొప్ప యోధుడిలా తయారవుతాడు. శివభక్తురాలైన పక్క గూడెం అమ్మాయి నెమలి (ప్రీతీ ముకుందన్)తో ప్రేమాయణం ఒకవైపు..
వాయులింగ మహత్మ్యాన్ని తెలిసిన కాలాముఖుడు దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో గూడేలపైకి దండెత్తడం.. ఆ మూకలను ఐక్యంగా ఎదుర్కొనే ప్రయత్నంలో తిన్నడు వెలివేతకు గురికావడం వంటి సీన్లు అలరిస్తాయి. దైవం లేదని మూర్ఖంగా వాదించే తిన్నడు.. శివభక్తురాలికి ఎలా దగ్గరయ్యాడు? మనువాడిన తర్వాత వారి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయి?
వాయులింగం వద్దకు తన భార్యతో ఎలాంటి సందర్భంలో చేరుకుంటాడు? వీళ్ల జీవితాల్లోకి రుద్ర (ప్రభాస్) ఎందుకొస్తాడు? అసలు ఈ రుద్ర ఎవరు? శివుడు ఉన్నాడని తిన్నడు నమ్మే పరిస్థితులేంటి? ‘కన్నప్ప’గా ఎలా మారుతాడు?.. ఇవన్నీ తెరపై చూడాల్సిందే!
ఎలా ఉందంటే..?:
రెండో శతాబ్దంలో స్వర్ణముఖి నదీతీరంలోని కొన్ని గూడేలు, అదే నదీతీరంలో రహస్య ప్రాంతంలో ఉన్న వాయులింగం చుట్టూ జరిగే కథ ఇది. గొప్ప శివభక్తుడి జీవితం.. చరిత్ర కాగా, కన్నప్పగా మారక మునుపు తిన్నడి నేపథ్యం ఏంటి? కల్పిత కథగా రాసుకున్న తీరు మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా తిన్నడు పాత్ర పరిచయం, అతని వీరత్వం, నెమలితో ప్రేమాయణం, కాలాముఖుడితో పోరాటం సన్నివేశాల సమ్మిళితం.
విశ్రాంతి సన్నివేశాల్లో మోహన్‌లాల్ ఎంట్రీతో హైప్ ఇచ్చారు. సెకండ్ హాఫ్‌లో కాలాముఖుడితో యుద్ధం, నెమలి జీవితం, రుద్ర ఎంట్రీ, తిన్నడు కన్నప్పగా మారే సన్నివేశాలతో సాగుతుంది. ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా ఓ రేంజ్‌కు చేరింది. నటీనటులు అంతా తమ పాత్రల్లో అలరించారు. సాంకేతిక అంశాలు చూస్తే.. కెమెరా విజువల్స్ బాగున్నాయి. సంగీతం ప్లస్ పాయింట్. మాటలు, పాటలు అర్థవంతంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి.