14 August, 2026 | 2:58 AM

వైద్యం అందని ద్రాక్షేనా?

14-08-2026 01:32 AM
  1. సింగరేణి రిటైర్డ్ కార్మికుల వైద్యానికి పరిమితులు
  2. ఎగ్జికూటివ్‌కు రూ.25 లక్షలు, నాన్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.8 లక్షలే
  3. పరిమితి దాటితే దిక్కెవరు? భారీ వ్యత్యాసంపై ప్రశ్నలు 
  4. ఆరేళ్లలో కార్పొరేట్ వైద్యానికి రూ.189 కోట్లు
  5. సాధారణ కార్మికులకు వెచ్చించింది రూ.22 కోట్లే

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13 (విజయక్రాంతి): సింగరేణి రిటైర్డ్ కార్మికుల వైద్యానికి పరిమితులు విధిస్తున్న సంస్థ.. కార్పొరేట్ ఆసుపత్రుల బిల్లులకు మాత్రం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందా? రిటైర్డ్ ఉద్యోగుల వైద్య పథకం అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆరేళ్లలో విశ్రాంత ఉద్యోగుల కార్పొరేట్ వైద్యానికి ఏకంగా రూ.189 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. మరో వైపు నాన్ ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వామికి కలిపి జీవితకాల వైద్య పరిమితి రూ.8లక్షలకే పరిమితి చేయడం విమర్శలకు తావిస్తోంది. సింగరేణి సంస్థ రిటైర్డ్ ఉద్యోగుల కోసం కంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీం(సీపీఆర్‌ఎంఎస్‌ఇ) అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశం కల్పించారు.

ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇలా..  

సీపీఆర్‌ఎంఎస్‌ఇ కింద రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగి, జీవిత భాగస్వామికి కలిపి జీవితకాలంలో గరిష్టంగా రూ.25 లక్షల వరకు వైద్య పరిమితి ఉంది. సింగిల్ మెంబర్ షిప్ రూ.12.50 లక్షల వరకు అవకాశం కల్పించారు.అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వామికి కలిపి గరిష్టంగా రూ.8 లక్షలకే పరిమితం చేశారు. తీవ్రమైన అనారోగ్యంతో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే చికిత్స ఖర్చు రూ.8 లక్షలు దాటితే పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. రూ.8 లక్షల పరిమితి దాటిన తర్వాత విశ్రాంత కార్మికుడి ప్రాణానికి బాధ్యత ఎవరిది? అని రిటైర్డ్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

40,813 మందికి రూ.189 కోట్ల వ్యయం 

ఆర్టీఐ ద్వారా లభించిన గణాంకాల ప్రకారం 2018 మధ్య ఆరేళ్ల కాలంలో సీపీఆర్‌ఎంఎస్‌ఇ పథకం కింద మొత్తం 40,813 మంది రిటైర్డ్ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యసేవల కోసం రూ.189 కోట్లు ఖర్చు చేశారు. వీరిలో 6,344 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ ఉద్యోగుల వైద్యానికి కేవలం రూ.22 కోట్లు, 34,469 మంది ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ ఉద్యోగుల వైద్యానికి రూ.166 కోట్లు వెచ్చించినట్లు అధికారిక వివరాలు పేర్కొంటున్నాయి.

కార్పొరేట్ ఆసుపత్రులకే ఎందుకు? 

సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో సంస్థకు భూమి, మౌలిక వసతులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రుల అభివృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ.. ప్రతి ఏటా కార్పొరేట్ ఆసుపత్రులకు కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే మొత్తాన్ని దీర్ఘకాలిక వైద్య మౌలిక వసతులపై పెట్టుబడిగా వినియోగిస్తే సింగరేణి పరిధిలో అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయవచ్చని కార్మిక సంఘాలు, విశ్రాంత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. నిష్ణాతులైన వైద్యులను నియమించి శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్యాన్ని అందించడంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక ప్రజలకు కూడా సేవలు అందించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

నిధుల వినియోగంపై దర్యాప్తు జరపాలి 

విశ్రాంత ఉద్యోగుల వైద్య పథకం పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులతో కుదుర్చుకున్న ఒప్పందాలు, చెల్లింపులు, వైద్య ఖర్చుల విధానం, లబ్ధిదారుల సంఖ్య తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు అవసరమని డిమాండ్ వినిపిస్తోంది.సింగరేణి నిధులు కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ ప్రాతిపదికన మళ్లించారు? ఒప్పందాల్లో సంస్థ ప్రయోజనాలు ఎంతవరకు రక్షించబడ్డాయి? రూ.189 కోట్ల ఖర్చుతో సంస్థకు దక్కిన వైద్య ప్రయోజనం ఎంత? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ఆర్థిక అవకతవకలు జరిగాయనే అనుమానాలను నివృత్తి చేసేందుకు సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.