14 August, 2026 | 2:31 AM

వ్యక్తిగత సైబర్ భద్రత అందరి బాధ్యత

14-08-2026 01:33 AM

ప్రజల అమాయకత్వంతోనే నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్లు

డీసీపీ భాస్కర్

చెన్నూర్, ఆగస్టు 13: వ్యక్తిగత సైబర్ భద్రత ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్షా కా తిరంగా సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు’ కార్యక్రమంలో భాగంగా చెన్నూర్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గరల్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, ఉద్యోగ సంబంధిత సమాచారం, వ్యక్తిగత ఫొటోలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఉంటాయని, ఇవి ఇతరుల చేతుల్లోకి వెళితే దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సైబర్ మోసాలకు ప్రధానంగా అత్యాశ, భయం అనే రెండు అంశాలను నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారని, పోలీసుల పేరుతో అరెస్ట్ చేస్తామని బెదిరించడం, పిల్లలు నేరంలో చిక్కుకున్నారని చెప్పి భయపెట్టడం వంటి పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

అలాగే లాటరీలు, భారీ లాభాల పేరుతో ఆశ చూపిస్తూ కూడా ప్రజలను మోసం చేస్తున్నారని అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని అందించడం ద్వారా సైబర్ నేరగాళ్లకు అవకాశం కల్పించినట్లవుతుందని సూచించారు.

వెయ్యి రూపాయల పెట్టుబడితో నెలలో రూ. 3 వేలు లాభం వంటి అసాధారణ ఆఫర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.