ఎంఎల్‌ఎస్ పాయింటే అడ్డా?
- అక్రమార్కుల కొత్త దారి
- బస్తాకు ఆరు కిలోలు బొక్కేస్తున్న వైనం
- రేషన్ తరుగు వెనుక ‘పేట’ డీలర్ హస్తం!
- ప్రతి నెలా రూ.1.60 కోట్ల బియ్యం పక్కదారి
సూర్యాపేట, అక్టోబర్ 1౮ (విజయక్రాంతి): ఆలోచన ఉంటే అక్రమాలు ఏలాగైనా చేయొచ్చు అన్నట్టు ఉంది సూర్యాపేట జిల్లా రేషన్ బియ్యం అక్రమ వ్యాపా రుల బాగోతం. గతంలో వినియోగదారులకు విక్రయించిన బియ్యంతోపాటు రేషన్ డీలర్ల నుంచి సేకరించేవారు.
అధికారులు, పోలీసులు నిఘా పటిష్టం చేయడంతో అక్రమార్కులు రూటు మార్చారని తెలుస్తోంది. కిందిస్థాయి నుంచి కాకుంగా నేరుగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ డీలర్లతోపాటు పాఠశాలలకు, హాస్టళ్లకు, అంగన్‌వాడీలకు ప్రతి నెల కోటా ప్రకారం అందించే బియ్యం బస్తా బరువు తగ్గడమే ఇందుకు నిదర్శనం.
ఒక్కో బస్తా బరువు 50 కిలోలు ఉండాల్సి ఉండగా.. ప్రతి బస్తా 4 కిలోల నుంచి 6 కిలోల వరకు తక్కువ బరువుతో సరఫరా అవుతున్నాయని పలువురు ప్రధానోపాధ్యాయులు, వార్డెన్‌లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో డీలర్లే అధికంగా నష్టపోతున్నా..
వారి అక్రమాలూ బయటపడతాయని గ మ్మున ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ అక్రమ వ్యాపా రం వెనుక జిల్లా కేంద్రానికి చెందిన ఓ రేషన్ డీలర్ ప్రధాన సూత్రదారి అని తెలిసింది. అతని అక్రమాల్లో కాంట్రాక్టర్లు, అధికారులకు సైతం వాటాలు ఉన్నట్టు విస్కృత ప్రచారం జరుగుతోంది.
స్టేజ్ నుంచే దోపిడీ?
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమాలకు డీలర్లకు బియ్యం సరఫరా చేసే ప్రభుత్వ గోదాములే అడ్డాగా మారాయని ఆరోపణలు ఉన్నాయి. రేషన్ డీలర్లకు, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేసే బియ్యం ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా స్థానిక ఎంఎల్‌ఎస్ పాయింట్లకు అందిస్తారు.
ఇక్కడి నుంచి బియ్యం వేబిడ్జీ కాంటా ద్వారా తూకం వేసి జీపీఎస్ సిస్టమ్ అమర్చిన వాహనాల ద్వారా రేషన్ డీలర్లు, పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా అవుతాయి. జిల్లాలోని ౪ నియోజకవర్గాల్లో ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆయా మండలాల డీలర్లు, పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేస్తుంటారు.
ఇక్కడే అసలు తతంగం మొదలవుతున్నది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్దకు రేషన్ డీలర్లు, పాఠశాల నిర్వాహకులు, హాస్టల్ వార్డెన్లు వెళ్లి తమ ఐడి ద్వారా బయోమెట్రిక్ వేసి బియ్యం బస్తాలు కాంటా వేసుకొని తీసుకెళ్లాలి. కానీ, ఇక్కడ ఒక బస్తా కాంటాపై ఉంచి పదేపదే తూకం వేసి కోటా పూర్తి చేస్తారని ఆరోపణలు వినవస్తున్నాయి.
ఆ తరువాత ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ బియ్యం రవాణా చేస్తారని.. ఇక్కడే బస్తాలు ఖాళీ అవుతాయని తెలుస్తోంది. ప్రతి బస్తా కాంటా వేయించి, రవాణా అయ్యే వరకు వారు ఉండలేరు.. కాబట్టి ఇదే అదునుగా అక్రమార్కులు బస్తాలోని బియ్యం ఖాళీ చేసి సరఫరా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ అధికంగా నష్టపోతున్నది రేషన్ డీలర్లే.
కానీ, ఇందులో వీరికీ వాటా ఉంటుందని, అంతేకాకుండా డీలర్లు పూర్తి స్థాయి కోటా బియ్యం కూడా ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి తీసుకెళ్లరని సమాచారం. ఇక్కడే తమ కోటాలో కొంత బియ్యాన్ని అక్రమ వ్యాపారులకు విక్రయిస్తారు. వినియోగదారుల నుంచి కొనుగోలు చేసే బియ్యంతో తరుగు పూడ్చుకోవడంతోపాటు అధికంగా సంపాదిస్తుండటంతో.. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో జరిగే తతంగంపై స్పందిచరనే విమర్శలు ఉన్నాయి.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు బియ్యం తరుగుపై ప్రశ్నిస్తున్నా.. వారి తప్పు కూడా ఉండటంతో అక్రమార్కుల దందాకు అడ్డూఅదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి నుంచి సేకరించిన బియ్యాన్ని సంచుల్లో నింపి ఫేక్‌ట్రక్ షీట్ల ద్వారా తమ స్థావరాలకు తరలించుకుంటున్నారు.
అంతా ఆ డీలర్ కనుసన్నుల్లోనే..
జిల్లాలోని నాలుగు ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఇదే రకం దందా జరుగుతుందని తెలుస్తోంది. ఈ వ్యాపారం వెనుక జిల్లా కేంద్రానికి చెందిన ఓ డీలర్ హస్తం ఉన్నదని, స్థానిక కాంట్రాక్టర్లు అతనితో కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇంతా జరుగుతున్నా అధికారులకు తెలియదా? అంటే అదీ లేదు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి అధికారికి ఇందులో వాటా ఉందని బహిరంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు అక్రమ దందాపై కన్నేసి, పేదల బియ్యం కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రతి నెల రూ.1.60 కోట్ల బియ్యం పక్కదారి
అధికారులు నిబంధనలు ఎంత కట్టుదిట్టం చేసినా రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం ఏదో ఓ రకంగా పక్కదారి పడుతూనే ఉన్నాయి. సూర్యా పేట జిల్లాలో 3,24,184 రేషన్ కార్డుదారులకు ప్రతి నెల 59,451 క్వింటాళ్ల బియ్యం.. పాఠశాలలు, హాస్టళ్లకు మరో 6 వేల కింటాళ్ల సన్న బియ్యం సరఫరా అవుతున్నాయి.
అంటే జిల్లాలో ప్రతి నెల సుమారు లక్ష40 వేల బస్తాల బియ్యం సరఫరా అవుతున్నాయి. బస్తాకు 4 కిలోల నుంచి 6 కిలోల వరకు తరుగు వస్తోందని ఆరోపణలు ఉన్నాయి. బస్తాకు సరాసరి 5 కిలోల బియ్యం తక్కువగా వచ్చినా.. సుమారు 7 వేల క్వింటాళ్ల బియ్యం మాయం అవుతున్నాయి. వీటి విలువ సుమారు రూ.1.60 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.






