కవిత్వంలో ఆనందానికి కాలం చెల్లిందా?
డా. సంగనభట్ల నరసయ్య వెలువరించిన కవితా సంపుటి ‘సమాంతర రేఖలు’. సాహితీ లోకానికి పరిశోధకుడిగా, పండితుడిగా, తెలివాహ తో చరిత్రకారుడిగానూ పరిచయమైనా అద్భుత కవితా ప్రయోగాలతో కవిగానూ మరో పార్శ్వాన్ని దర్శింపజేశారు. నరసయ్య ఒకచేత సంప్రదాయాన్ని అభిమానిస్తూనే మరోవైపు నుంచి అభ్యుదయ భావుకుడు.
‘సమాంతర రేఖలు’లో మొత్తం 31 కవితలు ఉన్నాయి. ‘దివ్వె నేత్రాలు’లో కొన్ని పద్యాలున్నా ఇందులో మాత్రం అన్నీ వచన కవితలే. అవన్నీ సమకాలీన సమస్యలకు స్పందనలే. భిన్నత్వంలో ఏకత్వ భావాన్ని మరిచిన వారికి మానవత్వాన్ని గుర్తుచేశారు. మతోన్మాదులకు తనదైన శైలిలో జ్ఞానబోధ చేశారు. మతాల ప్రాథమిక సూత్రాలని అవగాహన చేసుకోకుండా వ్యవహరించే వారికి ఇదొక హెచ్చరిక.
ఇవాళ కవులు పెరిగారు. కవితా సంకలనాల సంఖ్య కూడా పెరుగుతున్నది. కానీ, తీసుకున్న వస్తువును కవిత్వంగా మలచడానికి అవసరమైన భాషా పరిజ్ఞానం, అభివ్యక్తిలో విలక్షణత వంటివి కొరవడుతున్నాయి. పైగా ‘ఎంత అర్థం కాకుండా రాస్తే అంత గొప్ప’ అనుకుంటున్నారు కొందరు. ‘నేను కవినయ్యాను, శబ్దం మీద అధికారం సంపాదించావా అనకండి, అర్థం అక్కర్లేనిది ఈనాటి కవిత్వం, ఆనందం అవుట్ డేటెడ్’ అంటూ సంగనభట్ల వారు సెటైర్ విసిరారు.
సముద్రాన్ని చాలామంది గంభీరతకు పోలికగా తీసుకుంటారు కానీ, నరసయ్య దాన్నొక ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీకగా పేర్కొనడం విశేషం. ‘ఓహ్ ఈ సముద్రం’ అనే కవితలో ‘ఈ సముద్రం ఎంత భయంకరంగా ఉంది, మూడొంతుల భూమిని మింగేసిన బడా భూస్వామి, భూదాహంలా మాటిమాటికి భూమి దురాక్రమణకు, అలల హస్తాలతో ఉద్యమిస్తుంది’ అంటారు. ఆయన అభివ్యక్తి సామర్థ్యానికి ఇదొక ఉదాహరణ. మొత్తంగా మనసుకు మేధస్సుకు జరిగే సంఘర్షణనే సమాంతర రేఖలు’గా అక్షరబద్ధం చేశారాయన.
‘ఆశలు ఆకాశంలో పయనిస్తామంటే, ఆచరణలు పాతాళంలో పరి గెడుతామంటున్నాయి. మనసు విషాన్ని కక్కుతుంటే, ముఖం ముసిగా నవ్వుతానంటుంది’ అంటారు మరోచోట సీనియర్ కవి సంగనభట్ల. ఈ కవితలో నూతన ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రకృతి సంపద జాతి సంపదగా కాకుండా బహుళ జాతి కంపెనీల గుత్తసొమ్ముగా మారడం, చివరకు పర్యావరణాన్ని దెబ్బ తీస్తూ, మనిషి ఉనికినే ప్రశ్నార్థకం చేయడం..
వంటి సందర్భాలను ఆయన కవిత్వంలో చూస్తాం. కరీంనగర్ జిల్లాలో తన కళ్ళ ముందే వందలాది గుట్టలు పిండిగా మారుతుంటే తట్టుకోలేని నరసయ్య, తన అనుభూతిని అందరి అనుభూతిగా వ్యక్తం చేశారు ‘ఇంకెక్కడి కొండ’ అనే కవితలో. ‘అమ్మ పాలిస్తున్న స్థనంలా కొండ, పల్లెకు కొండంత అండగా నిలిచిన కొండ, పల్లీయుల ప్రాణాలకు సంజీవని కొండ, పైసలు అక్కర లేని పసివాళ్ళ అంగడి కొండ’ అంటారు. ‘చివరికి సంవేదనతో మనిషికి బతుకు నేర్పిన నేరానికి, తానే తెల్లారి పోయిన కొండ’ అని ముగిస్తారు.
ఇలా మన హృదయాలను ద్రవింప చేసే కవితలే అన్నీను. ప్రతిదీ పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. అభివ్యక్తిలో భాగంగా కవి అక్కడక్కడ ప్రయోగించిన ‘మూడు ప్లాట్లు ఆరు బ్యాంకర్లు, అక్షర రాక్షసుడా, దినపత్రిక పావురం, తెల్లనాగుల సెలయేళ్లు, వార్ధక్యపు శిథిలా లు’ మంచి పదబంధాలు. రుబ్బురోలు, తాజ్‌మహల్, మల్లెమొగ్గ మసి బొగ్గ, విచ్చుకున్న నేత్రం వంటి కవితలు భావగర్భితమైనవి. మానవీయ మూల్యాల పరిరక్షణకై కవితా శరసంధానం చేసి న సంగనభట్ల నరసయ్య సామాజిక అనుభూతికి, అభివ్యక్తికి అక్షరరూపమే ఈ సంపుటిని భావించాలి.






