భాగవత రచనా భాగస్వామి వెలిగందల నారయ
“ఏనుమృతుండ నౌదునని
యింతభయంబు మనంబులోవలన్
మానుము, సంభవంబుగల
మానవకోట్లకు జావు నిత్యమౌ
గాన హరిందలంపుమిక గల్గదు
జన్మము నీకు ధాత్రిపై
మానవనాథ! పొందెదవు
మాధవలోక నివాస సౌఖ్యముల్”
అంటూ భాగవత ప్రాధాన్యాన్ని, మాధవ స్మరణ ప్రాముఖ్యాన్ని చెబుతూనే మానవునికి పథ నిర్దేశం చేసిన ఈ పద్యం భాగవతంలోని 12వ స్కంధం లోనిది. మహాభాగవతాన్ని తెలుగులోకి అనువ దించి అమృత తుల్యమైన పద్యాలను అందించిన బమ్మెర పోతన్నకు శిష్యుడైన వెలిగందల నారయ కూడా ఈ భాగవత రచనలో భాగస్వామియై, అందులోని 11, 12 స్కంధాలను అనువదించి తరించాడు. ఈ పద్యాన్ని కూడా నారయ రచించడం ద్వారా ‘మానవుడు మరణభయాన్ని వదలిపెట్టి ఆ శ్రీమన్నారాయణుని స్మరణతో జీవితాన్ని తరింపజేసుకోవాలి’ అన్న గొప్ప సందేశాన్ని అందించాడు.
నలుగురు కవుల కృతి
మహాకవి బమ్మెర పోతన జీవితంలోని ప్రతి ఘట్టమూ ఆచరణీయం. మానవునికి వినయశీలతకు మార్గం చూపిన కవి పోతన్నే. భాగవతంలోని అవతారికే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఆయనకు శిష్య వాత్సల్యం మెండు కనుకే, భాగవత రచనవల్ల తానొక్కడే తరించాలనుకోకుండా మరో ముగ్గురికి భాగస్వామ్యం కలిగించాడు. ఏర్చూరి సింగన, బొప్పరాజు గంగన, వెలిగందల నారయలతో భాగవతం నలుగురు కవుల కృతిగా నిలిచింది.
అందులోనూ వెలిగందల నారయ పోతనకు తాను శిష్యుణ్ణన్న విషయాన్ని గ్రంథాంతంలోని గద్యలోనే చెప్పుకొని గురుస్మరణ చేశాడు. భాగవత రచనలోని భాగస్వాముల రచన పోతన్న రచనకు సరితూగక పోవచ్చు. కాని, వాళ్లకున్న ప్రత్యేకతలు వాళ్లకున్నాయి.
ఇదొక ప్రజాస్వామిక ధోరణి. మహాభారత రచనలోకూడా ముగ్గురే కవులైనా పూర్వపు కవులు వదిలిపెట్టిన భాగాలను వారు రచించి కవిత్రయ భారతముగా దానికి పేరు తెచ్చి పెట్టారు. భాగవతము నలుగురు కవుల రచనయైనా అది పోతన భాగవతంగానే ప్రసిద్ధి కెక్కింది. ఇందులో వారి కోసమే పోతన్న ఆ భాగాలను నిర్దేశించడం ద్వారా వారికి భాగస్వామ్యం కలిగించాడు. అంతేగాక, మిగిలిన ముగ్గురు కవుల రచనలు పోతన రచనకు దీటైనవి కాకపోవడం కూడా ఒకటి కావచ్చు.
సంగ్రహానువాదం
“ఇది శ్రీపరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర కేనన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారయ నామధేయ ప్రణీతంబైన శ్రీమహాభాగవతంబను మహా పురా ణంబునందు..” అంటూ చెప్పుకున్న గద్యనుబట్టి నారయ పోతన్న శిష్యుడేగాక దాదాపుగా పోతన గద్యవంటి గద్యనే రచించాడు. అలా, తాను పోతన ప్రభావంతోనే ఈ రెండు పర్వాల అనువాదానికి పూనుకున్నానడనిపిస్తుంది.
అయితే, పోతన శైలీ మధురిమ, పద్యమాధుర్యం వంటి గుణాలేవీ ఈ శిష్యునిలో లేవని కీ.శే. చాగంటి శేషయ్య, కీ.శే. ఆరుద్ర వంటి సాహిత్య శాస్త్రవేత్తలు భావించారు. వెలిగందల నారయ అనువాదం సంగ్రహానువాదంగా ఉన్నట్టు ఆచార్య ఎస్.వి.రామారావు అభిప్రాయపడ్డారు. అయితే, పోతన్న రచించిన కొన్ని స్కంధాల్లోకూడా గద్యలో పోతన గద్యయే ఉన్నా కొన్నికొన్ని స్కంధాల్లో వెలిగందల నారయ పద్యాల వంటి పద్యాలున్నాయని, అవి నారయ పద్యాలే అయి ఉంటాయని కూడా సాహితీవేత్తలు భావించారు.
ముఖ్యంగా 3వ స్కంధంలోని 289 పద్యాల్లో 97 పద్యగద్యాల వరకే పోతన్నవని, మిగిలినవన్నీ నారయ పద్యాలేనని ఆరుద్ర పేర్కొన్నారు. అంతేకాదు, దశమ స్కంధంలోని ఉత్తరభాగంలో కనిపించే 1,337 గద్యపద్యాల్లో ఎక్కువ భాగం వెలిగందల నారయవే ఉన్నాయని కూడా పేర్కొన్నారు. శైలినిబట్టే ఈ విధంగా భావిస్తున్నట్టు కూడా చెప్పారు.
చాగంటి శేషయ్య తమ ‘ఆంధ్రకవి తరంగిణి’లో నారయ రచించిన 11, 12 స్కంధాల్లో ‘హరిభట్టు’ రచించిన పద్యాలుకూడా చేరయని గుర్తించారు. బహుశా తరువాతి కాలంలో లేఖకులు వీటిని ఇందులో చేర్చి ఉండవచ్చునని అనుమానించారు. ప్రముఖ సాహితీవేత్తలు కీ.శే. నిడుదవోలు వెంకటరావు ‘పోతన్న అద్వైతి, నారయ విశిష్టాద్వైతి’ అని పేర్కొంటూ, నారయ రచనా భాగంలో చాలాచోట్ల విశిష్టాద్వైత సంప్రదాయాలు కనిపిస్తున్నాయని అన్నారు.
పోతన ప్రభావం
వెలిగందల నారయ పోతన్న శిష్యులు కావడం కారణంగా చాలా సందర్భాల్లో పోతన ప్రభావం కనిపిస్తుంది. పోతన పేరు స్మరించుకోగానే స్ఫురించేది ఆయన పద్యాల్లోని శబ్దాలంకార వైచిత్రి.
“అడిగెదనని కడువడి జను
అడిగిన దను నుడువదని నడయుడుగున్
వెడవెడ నిడిముడి దడబడ
నడుగిడు నడుగిడదు జడిమన డుగిడు నెడలన్”
అన్న సర్వలఘు కందం వంటి ఎన్నో పద్యాలు పోతన్న ప్రతిభకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ రచనా శైలికి అబ్బురపడ్డ వెలిగందల నారయ కూడా అనేక సర్వలఘు పద్యాలు రచించాడు. ఆయన రచించిన 11 స్కంధంలో
“నవ చరణ సరసిరుహ నయనయుగ నిజచరణ గగన చరనధి నిఖిల నిగమ వినుత
జలధిసుత కుచకలశ లలిత మృగమద రుచిర పరిమిళత నిజహృదయ ధరణి భరణ
ద్రుహిణ ముఖసుర నికరవిహిత నుతికలిత గుణకటి ఘటిత రుచిరతర కనక వసన
భుజగరిపు వరగమన రజతగిరిపతి వినుత సతతవృత జపనియమ సరణి చరిత
తిమికమద కిటినృహరి ముదిత బలి నిహి
తపద పరశుధర దశవదన విదళన
మురమథన కలికలుష సుముదప హరణ
కరివరద మునివర సురగడరుడ వినుత”
అన్న ఈ పద్యంలో తన గురువైన బమ్మెర పోతన్నకు ప్రీతికరమైన శబ్దాలంకార ధోరణిని అనుసరించి శ్రీమన్నారాయణుని దశావతార స్ఫురణను ప్రస్తావిస్తూ, ఏకంగా సీసపద్యాన్ని రచించాడు. అలా పోతన్నను స్ఫురింపజేశాడు.
‘సదానంద యోగి’ శతక రచన
వెలిగందల నారయ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అనుసరించేవాడు గనుక తన గురువైన పోతన్న అద్వైతి అయినా ఆ సంప్రదాయాలను ఎక్కడా చెప్పలేదు. తాను రచించిన భాగాల్లో తన విశిష్టాద్వైత సంప్రదాయాన్నే పాటించినట్లు తెలుస్తున్నదని సాహితీవేత్తలు నిర్ధారించారు. ఈయన రచించిన 11వ స్కంధంలో ‘శ్రీకృష్ణుణ్ణి వైకుంఠానికి రమ్మని బ్రహ్మాది దేవతలు వేడుకోవడం, కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవునికి పరమార్థాన్ని బోధించడం, యాదవుల మరణం, కృష్ణ బలరాముల నిర్యాణం’ మొదలైన అంశాలు ఉన్నాయి.
అదే విధంగా, 12వ స్కంధంలో ‘శుకుడు పరీక్షిత్తుకు మరణభయం వదలి పెట్టమని చెప్పడం’ మొదలైన అంశాలున్నాయి. తను రచించిన రెండు స్కంధాల్లోనూ నారయ మత్తేభం, శార్దూలం, ఉత్పలమాల, చంపకమాల, మత్తకోకిల వంటి వృత్తాలేగాక కందం, సీసం, ఆటవెలది, తేటగీతి వంటి దేశిపద్యాలతోపాటు మాలిని వంటి విశేష వృత్తాల్లోనూ రచన కొనసాగించాడు.
వెలిగందల నారయ ఇతర రచనలేవీ తెలియక పోయినా ‘శతక కవుల చరిత్ర’కారులైన వంగూరి సుబ్బారావు, నారయ ‘సదానంద యోగి’ శతక రచన చేసినట్లు తెలిపారు. ఆయన కూడా నారయకు గురుస్థానంలోని వాడేనన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇంతకు మించి వెలిగందల నారయ రచనలేవీ తెలుగు లోకానికి అందుబాటులో లేవు.
భాగవత రచనలో భాగస్వామి
‘వెలిగందల’ను ఇంటిపేరుగా కలిగిన నారయ భాగవత రచనలో భాగస్వామి కావడం వల్ల అది నిలిచినంత కాలం నిలుస్తాడు. ఆయన వెలిగందల గ్రామానికి చెందినవాడు గనుక ఆ పేరుకూడా నిలిచింది. ఈనాటికీ ఆ పేరుతోనే కరీంనగర్ పట్టణానికి సమీపంలోని వెలిగందల ఒక చారిత్రాత్మక గ్రామం. నేటికీ అక్కడి ఆలయాలు, వెలువడిన శాసనాలవల్ల ఆ గ్రామ వైభవం తెలుస్తున్నది. కాకతీయుల కాలం నాటినుంచి ఉన్న ఈ చారిత్రక గ్రామం 1905 వరకు కరీంనగర్‌కు జిల్లా కేంద్రంగా ఉండేది.
ఈ జిల్లాకు పూర్వనామంగానూ ఉండింది. బమ్మెర వాడైన పోతన తిరిగిన ప్రాంతాల్లోనిదైన ఈ వెలిగందలకు కూడా భాగవతం చిరకీర్తిని ఇచ్చింది. ఆ కవిత్వం పోతన స్థాయిలో లేకున్నా, సాహితీవేత్తలు తన రచన విషయంలో ఎన్ని కావ్య దోషాలు చూపించినా, సంవిధానంలో పరిణతి తక్కువైనా, వెలిగందల నారయ ‘భాగవత’ రచనా భాగస్వామి కావడమే ఆయనను చిరకాలం స్మరించుకునే కవిగా నిలిపింది. ఇదే పోతన తన శిష్యునిపై చూపిన అనుగ్రహానికి నిదర్శనం.






