2 May, 2026 | 10:55 PM

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

02-05-2026 09:36 PM

- అభివృద్ధి, సంక్షేమంతో కొనసాగుతున్న ప్రజాపాలన 

- గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ 

- గజ్వేల్ నియోజకవర్గ  ప్రజా పాలన ప్రగతి నివేదిక

గజ్వేల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ అన్నారు. గజ్వేల్ మహతి ఆడిటోరియంలో నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో చంద్రకళ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, తదితర అన్ని పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ఏసీపి నరసింహులు మాట్లాడుతూ ప్రజల రక్షణ ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. డ్రగ్స్ గంజాయి తదితర మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దీనివల్ల ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడానికి సులువుగా ఉంటుందన్నారు. గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ  సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ఇచ్చిన  హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.