పార్టీలు కాదు ప్రజా సంక్షేమమే ముఖ్యం
నేతలు ఎప్పుడు వస్తారో ఎదురుచూసే కాలం చెల్లింది
మనమంతా ఉన్నది ప్రజా సంక్షేమం కోసమే
పార్టీలు వేరైనా ప్రజా ఇబ్బందులను తమకు చెప్పండి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పార్టీలో వేరైనా ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలో బృందావన్ క్లాసిక్ గార్డెన్‌లో 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విఎఓ నుంచి కలెక్టర్ వరకు అధికారులు ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం చూపించాలని, మహిళా సాధికారతపై ప్రభుత్వ దృష్టి పెట్టిందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, భద్రత, సౌకర్యం పెంపు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ 95% ఇళ్లకు లాభం వస్తుందని,మహబూబ్‌నగర్‌లో 11,000 మంది రైతులకు రూ 82 కోట్ల రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ 20 వేల కోట్లతో 25 లక్షల కుటుంబాలకు రుణ విముక్తి కల్పించడం జరిగిందని స్పష్టం చేశారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని కోటి 15 లక్షల మంది ఈ బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాని,
మహబూబ్‌నగర్‌లో 3500 ఇళ్ల మంజూరు చేయడం జరిగిందని, ప్రజలు స్వయంగా ఇళ్లు నిర్మించుకోవడం నాణ్యత పెంపు ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా భారీ ఉపాధి అవకాశాలు వచ్చాయని,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ 50 వేల కోట్ల ప్రోత్సాహంతో పాటు కొత్త రేషన్ కార్డులు 13,000 జారీ చేశామని, 41 వేల మందికి రేషన్ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు రూ 3.26 కోట్ల చెక్కులను,మెప్మా ద్వారా మహిళలకు రూ 10,ల్.56 కోట్ల చెక్కుల పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరిని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.






