25 March, 2026 | 2:55 AM

ఇదొక చీటింగ్ బడ్జెట్?

25-03-2026 01:51 AM
  1. కేవలం కాగితాలకే పరిమితం
  2. అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే
  3. బీజేపీ సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాట్రిక్ చీటింగ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఇది ఎండమావి బడ్జెట్ అని, కేవలం కాగితాలకే పరిమితమైంది తప్ప.. 80 శాతం కూడా ఖర్చు చేయడం లేదన్నారు. దేశంలోనే అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాగ్ నివేదిక చూస్తే.. అసలు రంగు బయటపడుతుందన్నారు.

బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా మంగళవారం ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డ మీద రూ.2 లక్షల అప్పు మోపేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలే కారణమన్నారు. ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటే తప్ప.. రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల అనేక మంది చనిపోయారు. ఈ మర ణాలన్నీ ప్రభుత్వ హత్యలే. రైతు డిక్లరేషన్ అమలు చేయకపోగా.. వ్యవసాయ బడ్జెట్ను తగ్గించారు.

మహిళలకు సరైన కేటా యింపులు లేవు. వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై మంత్రి సీతక్క కలగజేసుకొని.. రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకి ఎం ఇచ్చారో చెప్పాలన్నారు.  

ఏలేటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : మంత్రి శ్రీధర్‌బాబు

బడ్జెట్‌ను చీటింగ్ బడ్జెట్‌గా అభివర్ణించిన బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బా బు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చో టు చేసుకోగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకుని ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు.