01-02-2026 12:53:48 AM
టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ముందు భారత్ పూర్తి ఫామ్ లోకి వచ్చేసింది. నాలుగో టీ ట్వంటీలో ఓడినప్పటకీ అద్భుతంగా పుంజుకున్న టీమిండియా ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ, సూర్యకుమార్ , హార్థిక్ పాండ్యా మెరుపులు తోడైతే.. బౌలింగ్ లో అర్షదీప్ పాంచ్ పటాకాతో కివీస్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. ఫలితంగా ప్రపంచకప్‌కు ఫుల్ స్వింగ్‌తో భారత్ సన్నద్ధమైంది.
తిరువనంతపురం, జనవరి 31 : ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్‌కు ముందు బౌలింగ్ సత్తాను కూడా పరీక్షించుకోవాలనుకున్న సూర్యకుమార్ అనుకున్న అంచనాలకు తగ్గట్టే బౌలింగ్ మార్పులు చేసాడు. అయితే భారత్‌కు ఈ సారి మంచి ఆరంభం దక్కలేదు. సంజూ శాంసన్ హోం గ్రౌండ్ లో కూడా ఫెయిలయ్యాడు. కేవలం 6 పరుగులకే వెనుదిరిగాడు. కాసేపటికే ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ కూడా వెనుదిరగడంతో కష్టాల్లో పడినట్టు కనిపించింది.
ఈ దశలో ఇషాన్ కిషన్ , సూర్యకు మార్ యాదవ్ జత కలిసారు వీరిద్దరూ చెరొక ఎండ్ నుంచీ రెచ్చిపోయారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కొడితే సిక్సర్ లేకుం టే బౌండరీ అన్న తరహాలో అతని ఇన్నింగ్స్ సాగింది. ఇషా న్ కిషన్ వీరబాదుడికి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బంతి ఎలా వేసినా బాదేయడంతో కివీస్ ఆటగాళ్ళంతా ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. ఈ మ్యాచ్‌లో చాలా మంది సంజూ శాంసన్ ఆట చూద్దామని ఎదురుచూశారు.
కానీ సంజూ శాంసన్, అభిషేక్ శర్మ త్వరగానే ఔటవడంతో కాస్త నిరాశ చెందారు. అయితే నిమిషాల వ్యవధిలోనే వారిని నిరాశను తీసేసాడు ఇషాన్ కిషన్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అసలు బంతి వేసేందుకు కూడా కివీస్ బౌలర్లు భయపడినట్టు కనిపించింది. ఎందుకంటే ఆఫ్ సైడ్ స్టంప్ కు దూరంగా బాల్ వేసినా దానిని వెంటాడి మరీ సిక్సర్ బాదాడంటే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ 42 బంతుల్లోనే శతకం సాధించాడు.
ఇష్ సోధి వేసిన 12వ ఓవర్లో వైడ్ తర్వాత మొదటి మూడు బంతులను ఫోర్లు బాదిన ఇషాన్ తర్వాత సిక్సర్ , ఫోర్ , సిక్సర్ తో కలిపి మొత్తం 29 పరుగులు పిండుకున్నాడు. ఇషాన్ కిషన్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుపు బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. 30 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 91 పరుగుల దగ్గర వరుసగా రెండు సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.
టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఐదో భారత బ్యాటర్ గా నిలిచాడు. భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. ఛేజింగ్ లో న్యూజిలాండ్ కూడా కాస్త దూకుడుగానే ఆడింది. టిమ్ స్టిఫెర్ట్ త్వరగానే ఔటైనా...ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర దుమ్మురేపారు. కేవలం 48 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మ్యాచ్ ఆసక్తకరంగా సాగించేలా కనిపించింది.
కానీ భారత స్పిన్నర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ కట్టడి చేశారు. ఫిన్ అలెెన్ 80 పరుగులకు ఔటవగా.. రచిన్ రవీంద్ర 30 , ఇష్ సోధి 33 పరుగుల చేయగా.. పరుగుల అంతరం తగ్గించేందుకే ఉపయోగపడింది. కివీస్ బ్యాటర్లు మెగాటోర్నికి ముందు బాగానే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నారు. అటు అర్షదీప్ 5 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. చివరికి న్యూజిలాండ్ 215 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది.
స్కోరు బోర్డు:
భారత్ ఇన్నింగ్స్ : 271/5 ( ఇషాన్ కిషన్ 103, సూర్యకుమార్ 63, హార్థిక్ పాండ్యా 42; ఫెర్గ్యూసన్ 2/41, శాంట్నర్ 1/60)
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 225 ఆలౌట్ ( ఫిన్ అలెన్ 80, సోధి 33, రచిన్ రవీంద్ర 30 ; అర్షదీప్ 5/51, అక్షర్ పటేల్ 3/33 )