04-05-2025 01:26:39 AM
అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
అంబర్‌పేట్ ఫ్లుఓవర్ పనుల్లో నిర్లక్ష్యంపై సీరియస్
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): రూ.415 కోట్ల వ్యయంతో నిర్మించిన అంబర్‌పేట్ ఫ్లుఓవర్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి వస్తున్నారని తెలిసినా కనీసం అభివృద్ధి పనులు పట్టించుకోకపోవడం ఏంటని అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం సాయం త్రం అంబర్‌పేట ఫ్లు ఓవర్ పనులను పరిశీలించిన తర్వాత ఆయన అధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. ఫ్లుఓవర్ కింద జరగాల్సిన రోడ్ల విస్తరణ, ప్లాంటేషన్, గ్రీనరీ డెవలప్‌మెంట్ వంటి పనులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ ధర్మారెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, అడిషనల్ డీసీపీ నర్సయ్యల తీరుపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
భూ సేకరణ బాధ్యతను మోస్తున్న జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. అధికారులు మతపరమైన నిర్మాణాల కారణంగా అడ్డంకులు ఉన్నట్లు చెపుతున్నప్పటికీ వాస్తవంగా అక్కడ అలాంటి సమస్యలే లేవని స్థానికులు అంటున్నట్లుగా వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యం, పోలీసు యంత్రాంగం రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందడాన్ని తప్పుబట్టారు. నిధులు ఇచ్చిన తర్వాత పనిచేయకపోతే ప్రజలకు సమాధానం చెప్పేది ఎవరని ఆయన అధికారులను నిలదీశారు. తక్షణమే పెండింగ్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.