17 April, 2026 | 2:52 AM

అమరవీరుల త్యాగాన్ని అవమానించడమే

17-04-2026 12:48 AM

బీజేపీకి తెలంగాణ అంటే కడుపుమంట

మంత్రి జూపల్లి కృష్ణారావు  

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్, పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు. బీజేపీ నేతలకు తెలంగాణ ఉనికి అన్నా, ఇక్కడి ప్రజల అభ్యున్నతి అన్నా మొదటి నుంచీ కడుపుమంటేనని గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది వందల మంది యువకుల బలిదానాలు, దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితం. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదించిన ప్రక్రియను దేశ విభజనతో పోల్చడం ఎంపీ అజ్ఞానానికి పరాకాష్ట. గతంలో ప్రధాని మోదీ కూడా తల్లిని చంపి బిడ్డను వేరుచేశారని మాట్లాడారు. ఆ విద్వేష భావజాలమే ఇప్పుడు ఎంపీ తేజస్వి సూర్య మాటల్లో ప్రతిబింబిస్తోంది’ అని దుయ్యబట్టారు. రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా, తెలంగాణ ప్రజ ల దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి సోనియాగాంధీ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. 

ఒక తల్లి మనసుతో తెలంగాణ బిడ్డల ఆవేదనను అర్థం చేసుకున్న వ్యక్తి సో నియాగాంధీ అని పేర్కొన్నారు. బీజేపీ నేత లు మాత్రం నిత్యం విషం చిమ్ముతూనే ఉ న్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్ల కోసం ఇక్కడి ప్రజలను వాడుకుంటూ, మనసులో మాత్రం తెలంగాణ పట్ల విద్వేషాన్ని నింపుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే, ఓర్వలేకనే బీజేపీ నేతలు ఇలాంటి వివాదాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.