ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం
కట్టంగూరు (నకిరేకల్), విజయక్రాంతి ఏప్రిల్ 16 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ పట్టణంలోని సత్యసాయి ఫంక్షన్ హాల్లో గురువారం ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రజలకు అందించిన వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును ఎమ్మెల్యే వివరించారు.
ప్రస్తుత ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి, విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ సుమారు రూ.8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మండలానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేయించుకున్నామని, త్వరలోనే మండల కేంద్రంలో ఎమ్మార్వో తహసిల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత-శ్రీనివాస్, వివిధ శాఖల మండల అధికారులు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






