31 August, 2026 | 2:26 AM

వ్యక్తిగత దూషణలకు దిగడం మంచిది కాదు

31-08-2026 12:00 AM

సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

కొత్తపల్లి, ఆగస్టు 30 (విజయ క్రాం తి): క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాలకవర్గం సమావేశంలో చర్చించి పరిష్కార మార్గానికి ప్రయత్నం చేయాలేగానీ మాజీ మేయర్లుగా పని చేసిన వాళ్లే వ్యక్తిగత దూషణలకు దిగడం మంచిది కాదని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కూరుకుపోయిన డ్రైనేజీని పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో కేంద్రం నుండి నిధుల వరద తీసుకువచ్చి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఓట్లు దండుకొని ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నారు.

నగర అభివృద్ధిపై వీరికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటాను కేంద్రం నుండి తీసుకువచ్చినట్టు ప్రజలకు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఆధిపత్య పోరుపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని, ఇప్పటికైనా కేంద్రం నుండి నగర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, నిరుద్యోగ యువతకు ఏదై నా ప్రాజెక్ట్ తీసుకురావడానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కృషి చేయాలని నరేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.