డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్ల విక్రయం
మెడికల్ షాపుపై డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్ తనిఖీలు.. షాపు సీజ్
కరీంనగర్ క్రైం, ఆగస్టు 30 (విజయ క్రాంతి): కరీంనగర్ రూరల్ పోలీసులు డ్రగ్స్, హాష్ ఆయిల్, గంజాయిని స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేసిన విష యం విదితమే. విచారణలో నిందితుల్లో ఒకరైన నితిన్ తన కు ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని, ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టపాల్-50 తదితర మత్తు టాబ్లెట్లను అధిక ధరలకు కొమ్మ రాము వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం నితిన్ తో పాటు మరో ఎనిమిది మంది కలిసి ఆ టాబ్లెట్లను నీటిలో కరిగించి, సిరింజీల ద్వారా తమ శరీరంలోని నరాల్లోకి ఎక్కించుకుని మత్తుకు అలవాటు పడినట్లు విచారణలో వెల్లడించారు.
అట్టి 9 మందిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. కరీంనగర్ రూరల్ పోలీసులు మెడికల్ షాపును తనిఖీ చేయాలని కోరుతూ కరీంనగర్ డ్రగ్ ఇన్స్పెక్టర్కు లేఖ పంపించారు. దీంతో డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ ఆరోగ్య ఫార్మసీ మెడికల్ షాపును తనిఖీ చేశారు. తనిఖీలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, సంబంధిత వివరాలను రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయకపోవడం వంటి అంశాలను గుర్తించారు. అనంతరం నిబంధనల ప్రకారం మెడికల్ షాపును సీజ్ చేశారు. ఈ క్రమంలో మెడికల్ షాపు యజమాని కొమ్మ రామును కరీంనగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.






