12 August, 2026 | 1:36 AM

1098 నంబర్ కాదు.. బాలల భవితవ్యం!

19-06-2024 12:05 AM
  • చిన్నారులకు భరోసానిస్తున్న టోల్ ఫ్రీ

గంటలోపే ఫిర్యాదులకు పరిష్కారం

బాల కార్మికులకు విముక్తి

రైల్వేస్టేషన్లలో ప్రత్యేక బృందాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1౮ (విజయక్రాంతి): ఆపదలో ఉన్న చిన్నారులకు 1098 భరోసానిస్తోంది. వారి ఇబ్బందులను తెలుసుకొని సంబంధిత బాల రక్షా భవన్ అధికారులు ఫిర్యాదులను గంటలోపే పరిష్కరిస్తున్నారు. జిల్లా సంక్షేమాధికారి, జిల్లా బాలల సంరక్షణాధికారి పర్యవేక్షణలో నిత్యం ఆపదలో ఉన్న చిన్నారుల నుంచి వచ్చే సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ భరోసానిస్తోంది. గత సెప్టెంబర్ నుంచి మే వరకు జిల్లాలో 993 కేసులను పరిష్కరించి సాయం కోసం ఫోన్ చేసిన చిన్నారులను రక్షిస్తోంది. ఆపదలోని శిశులను చేరదీసి శిశువిహార్ లాంటి కేంద్రాలకు పంపి బాగోగులను పర్యవేక్షిస్తోంది. పోక్సో కేసులలోనూ బాదితులకు సహకారం అందిస్తూ, పోలీస్‌శాఖతో కలిసి పనిచేస్తోంది.

రెస్క్యూ ద్వారా సంరక్షణ

చిన్నారులు ఆపదలో ఉన్నట్లు బాదితులు, పలువురు వ్యక్తుల ద్వారా 1098కు ప్రతీనెలా వందల కొద్దీ కాల్స్ వస్తున్నాయి. వచ్చిన కాల్స్ ఆధారంగా వారి లోకేషన్‌కు వెళ్లి బాదిత చిన్నారుల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా 14ఏళ్లలోపు పిల్లలను బాలకార్మికులుగా పరిగణిస్తారు. వారు పనిచేయడం నిషేదం. అయితే వివిధ రాష్ట్రాల నుంచి మహానగరానికి వలస కార్మికులు పనిచేసే ప్రదేశాలోల్ల వారి పిల్లలు బాల కార్మికులుగా మారకుండా బాలరక్షాభవన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బాల కార్మికులు పని చేస్తున్న ఫ్యాక్టరీలను గుర్తించి వారిని సంరక్షిస్తున్నారు.

హోటళ్లు, షాపుల్లో పని చేస్తున్న పిల్లలను గుర్తించి వారిని చదువుల నిమిత్తం బాలరక్షా భవన్ వాహనాల్లో చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్ (సీసీఐ)లకు తరలిస్తున్నారు. పలువురు తల్లిదండ్రులు వివిధ కారణాలతో పుట్టిన శిశువులను వదిలి వేసి వెళ్లిన సంఘటనల్లో శిశువులను చేరదీసి శిశువిహార్‌లకు తరలిస్తున్నారు. 18ఏళ్లలోపు బాలలు పనిచేసే షాపులను గుర్తించి ఆ యాజమాన్యాలకు కార్మికశాఖ ద్వారా ఫైన్లు వేసి కేసులు నమోదు చేయిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి మే వరకు జిల్లాలో 45 బాల్యవివాహాలను అడ్డుకొని పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి సీసీఎల్ కేంద్రాలకు తరలించి బాల రక్షా భవన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో బాలరక్షాభవన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. తప్పిపోయిన, కిడ్నాప్‌కు గురైనట్లు అనుమానం వచ్చిన పిల్లలను చేరదీసి సంరక్షిస్తున్నారు. వారి వివరాలను తెలుసుకొని తల్లిదండ్రులకు సమాచారం అందించి వారి వద్దకు చేరుస్తున్నారు. పోక్సో కేసులలోనూ బాదిత చిన్నారులకు, వారి కుటుంబ సభ్యులకు బాలరక్షాభవన్ అధికారులు తోడ్పాటునందిస్తూ, పోలీస్‌శాఖతో కలిసి పనిచేస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను హాస్టళ్లు, విద్యాసంస్థల్లో చేర్పిస్తూ వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నారు.