దళితబంధుపై దర్యాప్తు సాగేనా?
- పథకం అమలులో అక్రమాలున్నట్లు ఆరోపణలు
పూర్తి యూనిట్ అందకుండానే గ్రౌండింగ్ అయినట్లు లెక్కలు
30శాతం మేర నిధులు దళారుల పాలైనట్లు ప్రచారం
ఒక్కో యూనిట్‌పై రూ.3లక్షలు పక్కదారి పట్టినట్లు విమర్శలు
జీఎస్టీ పేరుతో మరో 2లక్షలు అక్రమార్కుల పాలైనట్లు చర్చ
సూర్యాపేట, జూన్18 (విజయక్రాంతి) : హుజూరాబాద్ ఉప ఎన్నికతో దళిత బంధు పథకం పురుడు పోసుకున్నది తెలిసిందే. అయితే ఈ పథకం అప్పటి అధికార పార్టీ కండువా కప్పుకున్న వారికే అం దించారనే విమర్శలు ఉండగా.. అమలు లో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేశారు. సుమారు 2500 మందిని అర్హులుగా గుర్తించారు. మొదటి విడతలో 2,223 మందికి యూనిట్లు మంజూరు చేశారు. జిల్లాలోని ఇతర నాలుగు నియోజకవర్గాలలో మొదటి విడతలో 345 మందికి వివిధ రకాల యూనిట్లు కేటాయించారు. జిల్లాలో మొత్తం 2,568 మందికి దళితబంధు అందింది. ఇందుకు ప్రభు త్వం రూ.256 కోట్లు ఖర్చు చేసింది. వీటిలో సుమారు 30 శాతం నిధులు లబ్ధిదారులకు చేరలేదనేది బహిరంగ రహస్యమే.
ఒక్కో యూనిట్‌కు రూ.3లక్షల వరకు
దళితబంధు పథకంలో అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు చేతివాటం ప్రదర్శించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కలెక్టరేట్ల ఎదుట లబ్ధిదారులు ధర్నాలు కూడా చేపట్టారు. తిరు మలగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి హైదరాబాద్‌లోని తన బంధువు దుకాణం నుంచే వందల సంఖ్యల్లో లబ్ధిదారులకు యూనిట్లు కేటాయించారని, రూ.10 లక్షల యూనిట్‌కు రూ. 7లక్షల వరకే ముట్టజెప్పారనే ఆరోపణలు ఉన్నాయి. తిరుమలగిరి లోని ఓ దుకాణాదారుడు 95 యూనిట్లకు, మరో స్టీల్ షాపు యాజమాని 30 యూనిట్లకు వివిధ వస్తు, సామగ్రి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. వీరంతా రూ. 3లక్షల వరకు కాజేశారని లబ్ధిదారులే ఆరోపించారు. నాయకులతో సంబంధితశాఖ అధికారులు కుమ్మకై లబ్ధిదారులను మోసం చేశారు. కాజేసిన సొమ్ములో అందరికి వాటా ఉందనే ఆరోపణలు లేకపోలేదు.
జీఎస్‌టీ పేరుతో మరో రూ. 2లక్షలు
దళితబంధు పేరుతో జరిగిన దగా అంతా ఇంతా కాదు. అవకాశం దొరికినప్పుడే అందినకాడికి దోచుకోవాలని చూసిన దళారులు జీఎస్‌టీ పేరుతో రూ.1.70లక్షల నుంచి 2లక్షల వరకు జేబులు నింపుకున్నట్లు తెలు స్తోంది. జిల్లాలో ఎక్కువగా డెయిరీ యూని ట్లు, ట్రాక్టర్, కారు కొనుగోళ్లతో పాటు అధికంగా కిరాణాదుకాణాలు, వస్త్ర వ్యాపారాలు, టెంట్ సామన్లు, సెంట్రింగ్ పరికరాలు కొనుగోలు చేశారు. వాహన యూనిట్లకు అధిక ధరలు వేసి డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది. ఇతర యూనిట్లకు జీఎస్‌టీ పేరుతో దోచుకున్నట్లు లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
డెయిరీ యూనిట్లలోనూ దగా
తిరిమలగరిలో 24 మందికి మినీ డెయిరీ యూనిట్లు మంజూరు చేశారు. రూ. 1.50 లక్షలతో రేకుల షెడ్డు వేయాల్సి ఉండగా అక్కడి కాంట్రాక్టర్ రూ.50 వేలతో మమ అనిపించి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కో యూనిట్‌కు ఆరు చొప్పున గేదెలు ఇవ్వాల్సి ఉండగా, కొన్ని యూనిట్లకు రెండు నుంచి నాలుగు గేదెలను మాత్రమే ఇచ్చారు. స్థానిక ఎంపీపీ కాంట్రాక్టర్‌గా గేదెల కొనుగోలు జరిగిందని, మిగిలిన గేదెలు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అధికారులు చేపట్టిన విచారణలో వాస్తవమని తేలినా చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేశారు. ఇప్పటికై నా దళితబంధు పథకం అమలుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే అస లు నిజాలు వెలుగులోకి వస్తాయనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో అధికారులు, పాలకులు ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.






