4 April, 2026 | 9:49 PM

కాంగ్రెస్‌తోనే బీసీల కలలు సాకారం

06-05-2024 02:28 AM

బీజేపీ హయాంలో బీసీలకు ఎక్కువ అన్యాయం  

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల 

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): బీసీల ఆకాంక్షలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లక్డీకపూల్‌లో బీసీల రాజకీయ మేథోమధన రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి జూజుల శ్రీనివాస్‌గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ చిరంజీవులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జూజుల మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారిగా ఓబీసీ ప్రధాని మోదీ అయినప్పటికీ ఓబీసీ డిమాండ్లను ఒక్కటీ పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

బీజేపీ పాలనలోనే బీసీలకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆరోపించారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ, బీసీ కులగణన, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకుండా తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అగ్రవర్ణ రిజర్వేషన్లు తీసుకొచ్చి సామాజిక రిజర్వేషన్ల లక్ష్యాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చిందని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీల ఆకాంక్షలు నెరవేరే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మొదటి సంతకం సమగ్ర కులగణన అంశంపై చేసి బీసీల రిజర్వేషన్లు పెంచుతారని తెలిపారు.

బీసీల డిమాండ్లను కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పొందుపర్చిందని, బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని బీసీ సంఘాల నేతలకు విజ్ఞప్తిచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ.. బీసీలు ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పది తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సమావేశానికి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ సంఘాల నేతలు బైరి రవికృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రంగౌడ్, కనకాల శ్యాం, ఇతర నాయకులతో పాటు 33 జిల్లాల నుంచి బీసీ శ్రేణులు పాల్గొన్నారు.