రాహుల్ కాదు.. రాంగ్ గాంధీ!
రాహుల్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ తోడుదొంగలే
నిర్మల్ సభలో మహిళలకు అవమానం
అబద్ధాల కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధిచెప్పాలి
మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట, మే 5 (విజయక్రాంతి): రాహుల్‌గాంధీ అబద్ధాలాడుతూ రాంగ్ గాంధీగా ముద్ర వేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను మళ్లీ ఓట్లు అడగటం సిగ్గుచేటన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సభలో మహిళలకు 2500 ఖాతాలో జమచేస్తున్నట్టు రాహుల్ ప్రకటించి రాష్ట్ర మహిళలను అవమాన పరిచారని చెప్పారు. రాహుల్‌గాంధీ అబద్ధాలు చెప్తుంటే.. రేవంత్‌రెడ్డి చప్పట్లు కొట్టి ఆమోదించటం హాస్యాస్పదమన్నారు.
రాహుల్, రేవంత్‌రెడ్డి ఇద్దరు రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ నాయకులను మహిళలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అంటేనే కపట నీతి, మోసం, దగా, కుట్రలు చేసే పార్టీ అని. దేశంలో పేదరికానికి, ఆకలికి కారణం కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని ప్రశ్నించారు. కూట్లె రాయి తీయనోడు.. ఏట్లో రాయి తీస్తానన్నట్టుగా రాహుల్‌గాంధీ ప్రసంగం ఉందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌పార్టీ శ్వేతపత్రం విడుదల చేసి చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలు చేసిన ప్రసంగాల వీడియోలను, కాంగ్రెస్‌పార్టీ మ్యానిఫెస్టోను ప్రదర్శించారు.




