20 June, 2026 | 2:40 AM

కమలం, కల్యాణ్ కలిసి వచ్చినా మాకు నష్టంలేదు

20-06-2026 12:57 AM

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్  

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : కమలం, పవన్ కల్యాణ్ కలిసి వచ్చినా కాం గ్రెస్ పార్టీకి వచ్చేనష్టమేమి లేదని పీసీసీ అ ధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్య లు తీసుకోవాలన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా గాంధీభవన్‌లో కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం మహేష్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ త్యాగధనులు కుటుంబంలో పుట్టిన  వారసుడు రాహుల్ గాంధీ అని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం వ్యక్తులు యూనివర్సిటీలో దూరడం వల్లే విద్యా వ్యవస్థ గతి తప్పిందన్నారు. నీట్ పరీక్ష కోసం 22 లక్షల మంది విద్యార్థులు రేయింబవళ్లు చదివి పరీక్షలు రాస్తే ప్రభుత్వం వైఫల్యం వల్ల వాళ్ల కష్టం బూడిద పాలైందన్నారు. యువత భావజాలం అర్ధం చేసుకున్న రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్నారు. 22 లక్షల మంది నీట్ విద్యార్థులు రూ. 1.32 లక్షల కోట్లు ఖర్చు అయిందని, కేంద్ర విద్యా వ్యవస్థకు కేటాయించే రూ.1.40 వేల కోట్ల బడ్జెట్ కి  నీట్ విద్యార్థుల ఖర్చు సమానమన్నారు. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా పీసీసీ డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు.