9 August, 2026 | 2:54 AM

తాగునీటి సమస్యను పరిష్కరిస్తా

26-05-2024 01:55 AM

కార్పొరేటర్ నర్సింహారెడ్డి

ఎల్బీనగర్, మే 25 : మన్సూరాబాద్ డివిజన్‌లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, ప్రజా సమస్యల పరిష్కరానికి నిత్యం కృషి చేస్తానని కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మన్సూరాబాద్ డివిజన్‌లోని వివిధ కాలనీల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీభవానీ కాలనీలో నిర్మిస్తున్న ప్రహారీ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలన్నారు.

కాలనీలోని పార్కు సమస్యపై జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడారు. పార్కు స్థలంలో గేట్ నిర్మిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. సీఎస్‌ఆర్ కాలనీలో ప్రారంభించిన ట్రంక్‌టైన్ పనులు ఇటీవల నిలిచిపోయాయని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి, ట్రంక్‌టైన్ పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. బృందావన్‌కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. పైపులైన్ నిర్మాణాలు చేపట్టి, నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.