9 August, 2026 | 12:31 AM

కుర్మల్‌గూడలో పర్యటించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

26-05-2024 01:56 AM

మహేశ్వరం, మే 25 : కుర్మల్‌గూడ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్‌గూడ, ఇంద్రనగర్‌లో నిర్మాణంలో ఉన్న ప్రైమరీ పాఠశాల, బడంగ్‌పేట్ గ్రంథాలయ బిల్డింగ్ దగ్గర్లో నూతనంగా నిర్మించనున్న హై స్కూల్ బిల్డింగ్ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కుర్మల్‌గూడలోనే అన్ని సౌకార్యలతో కూడిన స్కూల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వంలోనే ఈ పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జూన్ 13 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బడంగ్‌పేట్ ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న పాఠశాలను కుర్మల్‌గూడకు తరలించి, బడంగ్‌పేట్ స్కూల్ భవనంలో వైద్యశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. తమ గ్రామానికి కృష్ణా వాటర్ కావాలని ప్రజలు కోరుతున్నారని, వీలైనంతా త్వరగా పనులు జరిగేలా చూస్తామన్నారు.

దాదాపుగా 1500 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారని, వారి భద్రత కోసం రాచకొండ సీపీతో మాట్లాడి ఔట్‌పోస్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో మన ఊరు.. మన బడి పథకం కింద రూ.9 కోట్లను మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. అన్ని పనులు త్వరలోనే పూర్తయ్యేలా ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి, రోహిణి రమేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.