అంతా.. తూచ్!
హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను చిన్నాభిన్నం చేస్తానంటూ అల్టిమేటం జారీ చేసిన ట్రంప్.. ఆ ప్రకటన వెలువడిన 24 గంటలకే యూటర్న్ తీసుకున్నారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఆపే విషయమై ఇరాన్‌తో చర్చలు సాగుతున్నాయంటూ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ చేసిన ప్రకటన, కేవలం తన పరువు కాపాడుకోసమే అనేది అర్థమవుతున్నది.
ఇరాన్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని తన బలగాలను ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, అమెరికా వెనక్కి తగ్గడానికి కారణం శాంతి కాంక్ష కాదని, ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు తన వెన్నులో పుట్టించిన వణుకు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత కలిగిన అమెరికా ఎఫ్- విమానాన్ని ఇరాన్ డ్రోన్ కూల్చివేయడం, 4000 కిలోమీటర్ల రేంజ్ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణిని హిందూ మహాసముద్రంలోని అమెరికా సైనిక స్థావరంపై ప్రయోగించడం ట్రంప్‌ను ఆత్మరక్షణలో పడేశాయి.
గతంలో వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించి తెచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఇరాన్ విషయంలో మాత్రం చేతులెత్తేశారు. తన అల్టిమేటం చెల్లకపోవడం, మిత్రదేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో ఇప్పుడాయన శాంతి మంత్రాన్ని జపిస్తున్నారు. ఇరాన్ సైనిక శక్తిని తక్కువ అంచనా వేసిన అమెరికాకు, ఇప్పుడు వాస్తవ పరిస్థితులు స్ఫురణలోకి వచ్చాయి. అమెరికన్ పౌరులు కూడా ఈ అనవసర యుద్ధాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు.
ఇటు ఇరాన్ భీకర ప్రతిఘటన, అటు సొంత దేశంలో పెరుగుతున్న వ్యతిరేకత మధ్య ట్రంప్ తన ఓటమిని పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. మరోవైపు, ట్రంప్ తాజా ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించడం గమనార్హం. అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేదని ఆ దేశపు ప్రతినిధి మహమ్మద్ బగేర్ గలీబఫ్ స్పష్టం చేశారు. మార్కెట్లను ప్రభావితం చేయడానికి, తాము చిక్కుకున్న విషమ పరిస్థితుల నుంచి బయటపడటానికి ట్రంప్ ఫేక్ వార్తలు వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అమెరికా గద్దింపులకు ఇరాన్ లొంగకపోగా.. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని, మిత్ర దేశాలకు తప్ప శత్రుదేశాలకు ఎలాంటి అవకాశం ఇవ్వబోమని తెగేసి చెప్పింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా 13 శాతం మేర తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 96 డాలర్లకు దిగివచ్చాయి. క్రూడ్ ఆయిల్ తగ్గుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట.. అయితే, ఈ ధరలు మరింత తగ్గితేనే మార్కెట్లు ఊపిరిపోసుకుంటాయి.
ఇది కేవలం ట్రంప్ ఆడిన డబుల్ గేమ్ అని స్పష్టమవుతున్నది. ప్రపంచ పెద్దన్నలా బిల్డప్ ఇచ్చే అమెరికా శక్తి ఏపాటిదో, ఇప్పుడది కేవలం మేకపోతు గాంభీర్యమనేది తేలిపోయింది. ఇరాన్ గట్టిగా తలుచుకుని, దాడులు చేసి మరీ ఆ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
ఇరాన్ తెగువ ముందు అమెరికా ఆధిపత్యం తోకముడిచిందనేది అక్షర సత్యం. యుద్ధంలో గెలుపోటముల మాట పక్కన పెడితే.. ఇప్పటికే ఎన్నో దేశాల ప్రజలను యుద్ధం కోలుకోలేని దెబ్బతీసింది. మరింత నష్టం వాటిల్లక ముందే ఈ యుద్ధం త్వరగా ముగిసిపోవాలని యావత్ ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారు.




