పసిడి పట్టేస్తా!
- పారా అథ్లెట్ సుమిత్ అంటిల్
- ప్రపంచ రికార్డే లక్ష్యంగా..
- పారిస్ పారాలింపిక్స్
జావెలిన్ త్రో.. టోక్యో ఒలింపిక్స్ నుంచి భారత్‌లో బాగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన నీరజ్ పసిడి పతకంతో చరిత్ర సృష్టించాడు. ఆ వెంటనే పారాలింపిక్స్‌లోనూ ఇదే జావెలిన్ త్రో నుంచి మన దేశం ఒడిలో మరో స్వర్ణం వచ్చి చేరింది. అచ్చం నీరజ్‌ను గుర్తుచేస్తూ పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ పసిడి పతకం కొల్లగొట్టాడు. రెట్టింపు ఉత్సాహంతో పారిస్ పారాలింపిక్స్‌కు సిద్ధమవుతున్న సుమిత్‌కు ఆల్ ది బెస్ట్..
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ హోదాను నిలబెట్టుకుంటానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ ధీమా వ్యక్తం చేశాడు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్ వేదికగా పారాలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. ఈసారి భారత్ నుంచి 12 క్రీడాంశాల్లో 84 మంది పారా అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. పతకాధారులుగా సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్ వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుమిత్ అంటిల్ పారాలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న తీరును పంచుకున్నాడు. ‘జావెలిన్‌ను 80 మీటర్లు విసరడం లాంగ్ టర్మ్ గోల్‌గా పెట్టుకున్నా. పారిస్ పారాలింపిక్స్‌లో మాత్రం 75 మీటర్ల దూరం విసిరేందుకు ప్రయత్నిస్తా.
కచ్చితంగా స్వర్ణ పతకం నిలబెట్టుకుంటానన్న నమ్మకం ఉంది. ఈసారి ప్రాక్టీస్‌ను కాస్త భిన్నంగా సాగిస్తున్నా. టెక్నిక్‌లో ఎలాంటి మార్పు చేయకుండా భుజ బలాన్ని పెంచుకోవడంపై కష్టపడుతున్నా. పారిస్‌లో నా గత రికార్డును మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తా. ఇప్పటికైతే ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ పారిస్ చేరుకున్నాకా పోటీల్లో కాస్త ఒత్తిడి ఉండే అవకాశముంటుంది. ప్రదర్శన సమయంలో మాత్రం ఒత్తిడిని దరిచేర నీయకుండా జాగ్రత్త పడుతా.
ఈసారి పారాలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున పతకా ధారునిగా వ్యవహరించడం కోసం ఎదురుచూస్తున్నా. ఆ క్షణాన్ని ఆస్వాధించాలనుకుంటున్నా. భారత్‌లో ప్రాక్టీస్ చేసేందుకే ఎక్కువగా ఇష్టపడుతా. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ భాయ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఒత్తిడిలో అలాంటి ప్రదర్శన ఇవ్వడం మామూలు విషయం కాదు. కచ్చితంగా ఆరోజు అర్షద్ నదీమ్‌దే (పాకిస్థాన్ అథ్లెట్). నీరజ్ భయ్యా ఒక్కసారి 90 మీటర్లు దాటాడంటే భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరడం ఖాయం’ అని చెప్పుకొచ్చాడు.
రెజ్లర్ కావాలనుకొని..
హర్యానాలోని సోనిపట్ జిల్లా నుంచి వచ్చిన సుమిత్ అంటిల్ చిన్ననాటి నుంచి రెజ్లర్ కావాలని కలలు గన్నాడు. ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ కుస్తీపై తన ఆసక్తిని విడువలేదు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సాధించి రెజ్లర్‌గా కెరీర్‌ను ఆరంభించాలనుకున్నాడు. కానీ 17 ఏళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదం సుమిత్ జీవితాన్ని మలుపు తిప్పింది. మోటార్ బైక్ యాక్సిడెంట్‌లో ఎడమ కాలు విరగడంతో ఆపరేషన్ చేసి పూర్తిగా తొలగించారు.
రెజ్లర్ అవ్వాలనుకున్న సుమిత్ తన గోల్‌కు దూరమయ్యాడు. అయితే పారా అథ్లెట్‌గా కెరీర్‌ను కొనసాగించొచ్చని తెలుసుకున్న సుమిత్ గోస్పోర్ట్స్ ఫౌండేషన్‌ను కలుసుకున్నాడు. నితిన్ జైస్వాల్ ట్రైనింగ్‌లో జావెలిన్ త్రోలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. 2019లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న సుమిత్ అంటిల్ ఎఫ్ 64 జావెలిన్ త్రోలో రజతం గెలిచి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన సుమిత్ ఎఫ్ 64 జావెలిన్ త్రో ఫైనల్లో బరిసెను 68.55 మీటర్లు విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు.
మూడుసార్లు సుమిత్ తన రికార్డును తానే బద్దలు కొట్టడం విశేషం. 2022 ఆసియా పారా గేమ్స్‌తో పాటు 2023, 2024 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా స్వర్ణాలు సొంతం చేసుకున్నాడు. ఎఫ్ 64 జావెలిన్ త్రో కేటగిరిలో తిరుగులేని గుర్తింపు పొందిన సుమిత్ అంటిల్ మరోసారి పారాలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.






