ఫైనల్లో జానిక్ సిన్నర్
సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ
మాసన్ (అమెరికా): సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సిన్నర్ 7 (11/9), 5 7 (7/4)తో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయాన్ని నమోదు చేసుకున్నాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో ఇరువురు ఆటగాళ్లు ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. జ్వెరెవ్ కొరకరాని కొయ్యగా మారడంతో సిన్నర్ రెండుసార్లు ట్రై బ్రేక్‌లో విజయాన్ని అందుకోవాల్సి వచ్చింది.
ఇక నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో సిన్నర్ 12 ఏస్‌లు, 44 విన్నర్లు కొట్టాడు. 15 ఏస్‌లు, 38 విన్నర్లకు పరిమితమైన జ్వెరెవ్ ఐదు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. మరో సెమీస్‌లో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా) 4 6 7 (7/4)తో డెన్మార్క్‌కు చెందిన హోల్గర్ రూన్‌ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించాడు. నేడు సిన్నర్, టియాఫో మధ్య టైటిల్ ఫైట్ జరగనుంది. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లో బెలారస్ బామ సబలెంకాతో అమెరికా స్టార్ జెస్సికా పెగులా అమీతుమీ తేల్చుకోనుంది.






