జూన్ 25 నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం
బీఎల్వోలు, సూపర్వైజర్లకు ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఆదేశాలు
అశ్వాపురం, జూన్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత బీఎల్వోలు, బీఎల్‌ఏ సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పినపాక నియోజకవర్గ ఎన్నికల అధికారి బి. రాహుల్ ఆదేశించారు.
శుక్రవారం అశ్వాపురం మండల రైతు వేదికలో బీఎల్వోలు, బీఎల్‌ఏ సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, జూన్ 25 నుంచి జూలై 24 వరకు ప్రతి అర్హత కలిగిన ఓటరు ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాన్ని అందజేసి, అవసరమైన ఆధారాలతో పూర్తిగా నింపించిన అనంతరం మాత్రమే స్వీకరించాలని సూచించారు.
ఓటర్ల పేర్లు, కుటుంబ వివరాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి సర్వే పనులను పరిశీలించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని, నిర్ణీత గడువులో సర్వే ముగించేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్‌ఐ అనూష, మాస్టర్ ట్రైనర్లు హరమయ్య, బీఎల్వోలు, బీఎల్‌ఏ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.






