ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన
నాగర్ కర్నూల్, జూన్ 19 ( విజయక్రాంతి ): నాగర్ కర్నూల్ పట్టణంలో కొత్తగా మంజూరైన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, భరోసా కేంద్రం నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ శుక్రవారం కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ప్రతిపాదిత స్థలంలోని వాస్తవ పరిస్థితులు, రహదారి అనుసంధానం, భూమి విస్తీర్ణం, ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని పరిశీలించారు.
ప్రభుత్వ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళలు, చిన్నారులకు సమగ్ర సేవలు అందించేందుకు భరోసా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సురేష్బాబు, తహసీల్దార్ తబితారాణి తదితరులు పాల్గొన్నారు.






