11 August, 2026 | 3:03 PM

Breaking News

ఉప్పల్ స్టేడియం విద్యుత్ బకాయిల చెల్లింపు

19-06-2024 12:42 AM

రూ.1.48 కోట్ల చెక్కు సీఎండీకి అందజేత

గతంలో ఐపీఎల్ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుండగానే సరఫరా కట్  చేసిన అధికారులు 

అత్యుత్సాహం చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి) :  ఎట్టకేలకు ఉప్పల్ స్టేడియం విద్యుత్ బకాయిలు చెల్లించారు హెచ్‌సీఎల్ అధికారులు. బకాయిలు చెల్లించాలంటూ ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రాక్టీస్ జరుగుతుండగానే విద్యుత్ సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న హెచ్‌సీఎల్ రూ. 1.48 కోట్ల మేర బకాయిలను చెక్కు రూపంలో సీఎండీకి అందజేసింది. క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రతిష్టాత్మకం కావడం, ఈ మ్యాచ్‌లలో చాలా మంది ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు భాగస్వామ్యం అవుతుండటంతో బకాయిల చెల్లింపు హెచ్‌సీఏకు అనివార్యంగా మారింది.

అందుకే, 2015 నుంచి పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ. 1.63 కోట్ల విద్యుత్ బకాయిల్లో రూ. 1.48 కోట్ల బకాయిలను ఒకేసారి చెల్లించింది. కాగా, గతంలో ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుండగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ సమయంలో హెచ్‌సీఏ వర్గాలు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో చేసిన చర్చలు ఫలించడంతో ఎట్టకేలకు మ్యాచ్‌కు విద్యుత్‌ను పునరుద్దరించారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రశాతంగా జరిగింది. ఆ తర్వాత మొదటి విడతగా రూ. 15 లక్షలు చెల్లించారు. మిగతా బకాయిలను 4 లేదా 5 విడతలలో చెల్లించాలని హెచ్‌సీఏ భావించినప్పటికీ, హెచ్‌సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని మిగిలిన మొత్తం రూ. 1,48, 94,521 బకాయిలను టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీకి హెచ్‌సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు మంగళవారం చెక్కు రూపంలో అందజేశారు. దీంతో పదేళ్లుగా విద్యుత్ బకాయిల వివాదం సమసిపోయినట్టయ్యింది. 

అధికారులపై చర్యలు తీసుకోవాలి

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ప్రాక్టీస్ జరుగుతుండగానే విద్యుత్ సరఫరాను కట్ చేయడంతో హైదరాబాద్ క్రికె ట్ అసోసియేషన్ ప్రతిష్ట జాతీయ స్థాయి లో దెబ్బతిన్నట్టుగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు వాపోయారు. ఆ రోజు స్టేడియం విద్యుత్ సరఫరాను కట్ చేసి అత్యుత్సాహం చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎండీని కోరారు. అందుకు బాధ్యులైన వారిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.