మోదీతో ఇది ఫైనల్స్

01-05-2024 01:42:17 AM

‘అసెంబ్లీ’ సెమీస్‌లో బీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపాం

తెలంగాణకు గాడిద గుడ్డు.. గుజరాత్‌కు బంగారు గుడ్డు

ప్రధాని నరేంద్రమోదీ పదేండ్ల పాలనలో జరిగింది ఇదే

రంగారెడ్డి, భూపాలపల్లి, కరీంనగర్ సభల్లో సీఎం రేవంత్

జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, మహేశ్వరం, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): సెమీఫైనల్స్‌లాంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీఆర్‌ఎస్‌ను గద్దె దింపి ఇంటికి పంపించామని, ఫైనల్స్‌లాంటి లోక్‌సభ ఎన్నికల్లో మోదీ, అమిత్ షాను కూడా ఇంటికి పంపుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మోదీ పదేండ్ల పాలనలో తెలంగాణకు గాడిద గుడ్డు, గుజరాత్‌కు బంగారు గుడ్డు ఇచ్చారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మంగళవారం రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన నిర్వహించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించి జనజాతర సభల్లో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్, బడంగ్‌పేట్, సరూర్‌నగర్‌లో కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ కార్యకర్తలు రక్తాన్ని ధారపోసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చారని కొనియాడారు. ‘డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ మాత్రమే. సెమీ ఫైనల్స్‌లో కేసీఆర్‌ను ఓడించాం. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఫైనల్స్. ఈ ఫైనల్స్‌లో బీజేపీని ఓడించి నరేంద్రమోదీ, అమిత్‌షాను ఇంటికి పంపించాలి’ అని పిలుపునిచ్చారు. ‘మా కారు రిపేర్ కోసం షెడ్డుకు పోయింది. మళ్లీ వస్తది అని కేటీఆర్ అంటుండు. కానీ అది మళ్లీ రాదు. ఈ విషయం కేసీఆర్‌కు బాగా అర్థమైంది. అందుకే ఈ మధ్య ఆయన బస్సు వేసుకొని జిల్లాలకు బయలుదేరారు.

కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన ఐదు నెలలకే నన్ను అధికారం నుంచి దింపేస్తా అంటున్నాడు. రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి అంటున్నాడు. బిడ్డా కేసీఆర్.. నీలాగా నేను ఉద్యమ వీరుల ప్రాణాలను బలి తీసుకొని సీఎం కాలేదు. పోరాడి సాధించుకున్నాం. బిడ్డా మా కార్యకర్తలు తలుచుకుంటే నీ అంతు చూస్తారు. మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నావు. ఇక నీ జీవితంలో సీఎం కాలేవు’ అని స్పష్టంచేశారు. మహేశ్వరంలో ఎమ్మెల్యే సబిత ఉదయం కారు గుర్తుకు ఓటు వేయమని,రాత్రి కాగానే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయమని అడుగుతున్నారని విమర్శించారు. 

మోదీ చిల్లర రాజకీయం

ప్రధాని నరేంద్రమోదీ ఓట్లకోసం చిల్లర రాజకీయం చేస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే మోదీ అవమానించారని, తెలంగాణపై విషం చిమ్మిన మోదీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం చేస్తాన్న మోదీ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ‘నన్ను పట్టుకురమ్మని మొన్న ఢిల్లీ నుంచి పోలీసులను గాంధీభవన్‌కు పంపించాడు. రేవంత్‌రెడ్డి ఎప్పుడైనా భయపడ్డారా?’ అని ప్రశ్నించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై సర్జికల్ స్ట్రుక్ చేస్తుందని హెచ్చరించారు.

తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పదేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. తెలంగాణకు వచ్చిన అనేక సంస్థలను మోదీ అడ్డుకొన్నారని ఆరోపించారు. తెలంగాణకు గాడిద గుడ్డు.. గుజరాత్‌కు బంగారు గుడ్డు ఇస్తావా? అని ప్రధానిని నిలదీశారు. తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ, గుజరాత్ టీంకు మోదీ, అమితాషా కెప్టెన్లుగా ఉన్నారు. యువత కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండి తెలంగాణ టీంను గెలిపించుకోవాలి. ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరాటం’ అని స్పష్టంచేశారు. కేసీఆర్ చచ్చిన పాము అని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో తెలంగాణ పుట్టుకను మోదీ అవహేళన చేస్తుంటే బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

వడదెబ్బతో వృద్ధురాలి మృతి

జమ్మికుంటలో సీఎం బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ వడదెబ్బతో మృతి చెందింది. ఎండ ఎక్కువగా ఉండటం హాజరయ్యేందుకు వృద్ధురాలు వచ్చింది. ఎండ వేడి తట్టుకోలేక సృహతప్పి కిందపడిపోగా దవాఖానకు తరలించేలోపే మృతిచెందింది. మృతిరాలి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మనం హిందువులం కాదా?

అయోధ్యలో రాముని కళ్యాణం జరగకముందే అక్షింతలు ఇంటికి పంపించి సంప్రదాయాలను బీజేపీ మంట గలిపిందని రేవంత్ ధ్వజమెత్తారు. ‘మనందరం రాముని భక్తులం కాదా? మనం పండుగలు చేసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీవాళ్లు దేవుని బొమ్మ చూపించి ఓట్లు అడుక్కునే నీచ రాజకీయాలు చేస్తున్నారు’ అని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ జనగణన కోసం చర్యలు చేపట్టామని తెలిపారు. ‘బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయాలను కుంటున్నది. అందులో భాగంగానే 400 సీట్లు కావాలంటున్నారు. 2/3 మెజార్టీ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారు. సర్జికల్ స్ట్రుక్ చేసి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ సిద్ధమవుతున్నారు. ఆగస్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా’ అని తెలిపారు