10 April, 2026 | 4:00 AM

బాలికలే బెస్ట్

01-05-2024 01:45 AM

టెన్త్‌లో 91.31 శాతం ఉత్తీర్ణత

8,883 మందికి 10/10 జీపీఏ

2096 ప్రభుత్వ, గురుకులాల్లో అందరూ ఉత్తీర్ణత

నిర్మల్ జిల్లా ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్

ప్రైవేటుకంటే గురుకులాల్లో ఎక్కువ ఉత్తీర్ణత

గణితంలో 17,694 మంది ఫెయిల్

జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

ఫలితాలు విడుదల చేసిన అధికారులు

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఈ ఏడాది పదో తరగతితో 91.31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 8,883 మందికి 10/10 జీపీఏ (గ్రేడ్ పాయింట్ యావరేజ్) వచ్చాయి. గత ఏడాది పదో తరగతిలో 86.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈసారి ఉత్తీర్ణత 4.71 శాతం పెరిగింది. మంగళవారం ఎస్సీఈఆర్టీ భవన్‌లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు, అడిషనల్ డైరెక్టర్ లింగయ్యతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 4,94,207 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కాగా 4,51,272 మంది ఉత్తీర్ణులయ్యారు.

వీరిలో అమ్మాయిలు 2,45,208 మందికిగాను 2,28,616 మంది పాస్‌కాగా, అబ్బాయిలు 2,48,999 మందికిగాను 2,22,656 మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే అధికంగా పాసయ్యారు. అబ్బాయిలు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిలు 93.23 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రైవేట్‌లో పరీక్షలు రాసిన 11,606 మంది విద్యార్థులకు 5,772 (49.73 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 3927 పాఠశాలల్లో అందరూ పాస్ కాగా, 6 ప్రైవేట్ పాఠశాలలు సున్నా ఫలితాలను సాధించాయి. గత ఏడాది 2793 పాఠశాలల్లో అందరూ పాస్ కాగా, 25 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు. ఈసారి 99.05 శాతంతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 65.10 శాతం ఫలితాలతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. 

నాలుగో స్థానంలో తెలుగు మీడియం విద్యార్థులు

తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, ఇతర భాషల్లో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఇంగ్లిష్ మీడియంలో 4,01,458 మంది పరీక్ష రాశారు. వీరిలో 3,76,317 (93.74 శాతం) మంది పాసయ్యారు. తెలుగు మీడియంలో 84,790 మంది పరీక్ష రాయగా, 68,437 (80.71 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఉర్దూ మీడియంలో 7,508 మందికి 6,119 (81.50 శాతం) మంది, ఇతరులు 451 మందికి 399 (88.47 శాతం) మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతంగా చూస్తే తెలుగు మీడియం విద్యార్థులు అందరికంటే చివరణ నాలుగో స్థానానికే పరిమితమయ్యారు.

గురుకులాలు టాప్

పదో తరగతి ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్ స్కూళ్లలో 93.74 శాతం ఉత్తీర్ణత సాధించగా, గురుకులాల్లో 98.71 శాతం పాసయ్యారు. బీసీ వెల్ఫేర్‌లో 98.21శాతం, సోషల్ వెల్ఫేర్‌లో 98.02 శాతం, ట్రైబల్ వెల్ఫేర్‌లో 97.16 శాతం, మైనార్టీ వెల్ఫేర్‌లో 96.82 శాతం, మోడల్ స్కూళ్లలో 95.06 శాతం మంది ఉతతీర్ణత సాధించారు. కేజీబీవీల్లో 93.06 శాతం, ఆశ్రమ్ బడుల్లో 89.64 శాతం, ఎయిడెడ్‌లో 88.61 శాతం, జిల్లా పరిషత్‌లో 86.03 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 80.18 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 

గణితంలో ఎక్కువ ఫెయిల్

ఈసారి గణితం, సామాన్య శాస్త్రంలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. 17,694 మంది గణితంలో ఫెయిల్ అయ్యారు. బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ రెండు పేపర్లుగా పరీక్ష నిర్వహించారు. సైన్స్ సబ్జెక్టులో 16,952 మంది ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ లాంగ్వేజ్‌లో 97.12 శాతం మంది పాస్ కాగా, సెకండ్ లాంగ్వేజ్‌లో 99.87 శాతం, థర్డ్ లాంగ్వేజ్‌లో 98.30 శాతం, సోషల్‌లో 99.05 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి 13వ తేదీవరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో మే 16వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 15 రోజుల పాటు అవకాశం కల్పించారు. రీ కౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

10/10 జీపీఏ సాధించినవారు

పాఠశాల విద్యార్థుల సంఖ్య

ఎయిడెడ్ 58 

ఆశ్రమ్ 1

బీసీ వెల్ఫేర్ 386

ప్రభుత్వ 17

కేజీబీవీ 32

మోడల్ 137

ప్రైవేట్ 7,635

రెసిడెన్షియల్ 89

మైనార్టీ వెల్ఫేర్ 79

సోషల్ వెల్ఫేర్ 201

ట్రైబల్ వెల్ఫేర్ 36

జిల్లా పరిషత్ 212

మొత్తం 8,883

టెన్త్ ఫలితాల్లో టాప్ 5 జిల్లాలు

జిల్లా రాసినవారు పాసైనవారు ఉత్తీర్ణత శాతం

నిర్మల్ 8908 8823 99.05

సిద్దిపేట 13,976 13,788 98.65

సిరిసిల్ల 6470 6358 98.27

జనగామ 6692 6569 98.16

సంగారెడ్డి 22,012 21,540 97.86

    ఫలితాలు ఇలా (రెగ్యులర్)

బాలురు బాలికలు మొత్తం

రాసినవారు 2,48,999 2,45,208 4,94,207

పాసైనవారు 2,22,656 2,28,616 4,51,272

శాతం 89.42 93.23 91.31

విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు 

పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇదే జీవితం కాదు. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైన వారు ఎందరో జీవితంలో రాణించారు. ఫెయిలైన వారెవరూ ఆందోళన చెందొద్దు. జూన్‌లో సప్లిమెంటరీ పరీక్షలు పెడుతున్నాము. బాగా చదివి పాస్ కావాలి. ఈసారి ప్రభుత్వ స్కూళ్లలో కాస్త ఫలితాలు తగ్గాయి. తక్కువ ఫలితాలు వచ్చిన ప్రభుత్వ స్కూళ్లపై దృష్టి సారిస్తాం. ప్రైవేట్ స్కూళ్ల కంటే కూడా గురుకులాల్లో మంచి ఫలితాలను రాబట్టాము.

 బుర్రా వెంకటేశం, రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి.