23 August, 2026 | 2:43 PM

కాంగ్రెస్ అంటేనే పదవుల కోసం ఆరాటాలు, వాటాల కోసం కొట్లాటలు

23-08-2026 02:02 PM

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు

కాళేశ్వరంపై కాంగ్రెస్-బీజేపీ నాటకాలు తేటతెల్లం 

హైదరాబాద్: కాళేశ్వరంపై(Kaleshwaram) కాంగ్రెస్-బీజేపీ నాటకాలు తేటతెల్లమయ్యాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో ఎలాంటి లోపాలు లేవని CWC ఇచ్చిన రిపోర్టుతో తేలిపోయిందని తెలిపారు. కృష్ణా రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్(Revanth Reddy) ద్రోహం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ పంటకు సరిపడా సాగర్ లోనీళ్లున్నా వినియోగించడం లేదని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం తీరుతో నల్గొండ జిల్లా రైతులు నష్టపోతున్నారని వాపోయారు.

పోతిరెడ్డిపాడు(Pothireddypadu)తో ఏపీ అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే యాగం చేసి నల్గొండ రైతులను(Nalgonda farmers) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పక్కదారి పట్టించారని విమర్శించారు. ''రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లున్నా భారీ కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు. ​సాగుకు నీళ్లిస్తే.. కరెంటు ఇవ్వాలి, యూరియా, డీఏపీ ఇవ్వాలి, పంట పండితే బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాల్సివస్తుంది, అందుకే, నీళ్లు ఇవ్వకపోతే ఇవేవీ ఇవ్వకుండా తప్పించుకోవచ్చనే దురుద్దేశంతోనే రేవంత్ ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపింది' అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ అంటేనే పదవుల కోసం ఆరాటాలు, వాటాల కోసం కొట్లాటలని మళ్లొక్కసారి గుర్తుచేశారని చమత్కరించారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలను పట్టించుకోకుండా ఇన్ని రోజులు వాటాల పంపకాల కోసం కొట్లాడారు, ఇప్పుడు అధికార మార్పిడి కోసం కొట్లాడుకుంటున్నారని  విమర్శించారు. ఎల్ నినో లాంటి విపత్తును దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికైనా రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పాలన్నారు. ఇప్పటికైనా వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి చెరువులు, రిజర్వాయర్లు నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.