జైల్.. బెయిల్.. మళ్లీ ఖేల్ షురూ
- లీకేజీ మాఫియా ఇవన్నీ పట్టించుకోదు
- బయటివచ్చాక మళ్లీ అదే పని
- లీకేజీలో నెట్‌వర్కింగ్ అత్యంత కీలకం
- స్టింగ్ ఆపరేషన్‌లో పాత నిందితుడు బిజేందర్ గుప్తా
న్యూఢిల్లీ, జూన్ 25: జైలుకు వెళ్తాం.. వస్తాం.. మళ్లీ ఆట షురూ.. ఇదీ దేశవ్యాప్తంగా పలు పేపర్ల లీకేజీ కేసుల్లో కీలక సభ్యుడిగా ఉన్న బిజేందర్ గుప్తా ధీమా. ప్రస్తుతం నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశమంతా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషనలో ఈ విధంగా బిజేందర్ చెప్పడం గమనార్హం. 24 ఏళ్లుగా లీకేజీ వ్యాపారంతో సంబంధమున్న గుప్తా.. ఇందులో నెట్‌వర్క్ పెంచుకోవడమే కీలకమని తెలిపారు.
మార్చిలోనే చెప్పాడు..
నీట్ పేపర్ లీకవుతుందని బిజేందర్ మార్చిలోనే జోస్యం చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నీట్ పేపర్ లీకేజీలో 700 మంది అభ్యర్థులను గుర్తించి, సుమారు రూ.200 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుని చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా ప్రశ్నాపత్రాలను తరలించేటప్పుడు బాక్సుల్లో నుంచి ప్రశ్నాపత్రాలు ఎలా చేజిక్కుంచుకుంటారు? బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీలు పేపర్ ప్రింటింగ్ టెండర్లను ఎలా దక్కించుకుంటాయనే వివరాలను వెల్లడించాడు. పేపర్ లీకేజీలో చాలా పద్ధతులను ఉపయోగిస్తారని, ఉదారహణకు ప్రభుత్వంలో పెద్ద వ్యక్తులతో సంబంధాలు, ప్రింటింగ్ ప్రెస్‌తో ఒప్పందాలు చేసుకుంటారని స్పష్టం చేశాడు.
ఎన్టీయే గ్రహించలేకపోయింది..
పేపర్ లీకేజీల్లో తమ పాత్రపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు బిజేందర్. జైలుకెళతాం, బెయిల్‌పై వస్తాం, మళ్లీ ఖేల్ షురూ చేస్తాం అని ధీమా చెప్పాడు. ఏదైనా తప్పు జరిగిందని తెలిస్తే అందరూ రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది. ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తులో సరైన దిశలో వెళుతోంది. కానీ, ఎన్టీయే దీన్ని గ్రహించలేకపోయింది. బేడీ రామ్.. దేశంలో అతిపెద్ద పేపర్ లీక్ మాఫియా గురించి వినే ఉంటారు. జౌన్‌పూర్‌లో ఇది జరిగినప్పుడు నేను బేడీ రామ్‌కు సహాయకుడిగా ఉన్నా. అప్పుడు ఓ అభ్యర్థికి జాబ్ వచ్చేలా సాయం చేసి జైలుకు వెళ్లాం.
కానీ ఇప్పుడు జౌన్‌పూర్ ఎమ్మెల్యే బేడీ రామ్ అని తెలిపారు. నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న సంజీవ్ ముఖియా, ఇటీవల అరెస్ట్ అయిన విశాల్ చౌరాసియా తనకు తెలుసునని పేర్కొన్నాడు. ముఖియాకు దాదాపు రూ.30 కోట్ల అప్పులు ఉన్నాయని, అయినా అతను ఎప్పుడు ఈ రాకెట్ నుంచి బయటికి రాలేదని పేర్కొన్నాడు. జైలులో ఎక్కువకాలం ఉంచలేరు కదా.. బయటికి వచ్చి మళ్లీ మొదలుపెడతారని వివరించారు. నీట్ పరీక్షకు ముందు మే 4న పాట్నాలోని లెర్న్ ప్లే స్కూల్‌తో సంబంధమున్న హాస్టల్‌లో 25 మంది అభ్యర్థులకు వసతి కల్పించినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపాడు. అయితే సంజీవ్ ముఖియా మాత్రం పోలీసులకు చిక్కడని బిజేందర్ ధీమా వ్యక్తం చేశాడు.
నీట్ పేపర్ ఎలా లీకైంది?
నీట్ ప్రశ్నాపత్రం 700 మంది విద్యార్థులకు ఎలా చేరిందనే ప్రశ్నకు బిజేందర్ సమాధానం ఇచ్చారు. ఇది విస్తృతమైన నెట్‌వర్క్‌తో సాధ్యమవుతుందని, పంపిణీ సమయంలో లీకైనట్లు తెలిపాడు. ఢిల్లీ, పాట్నా, మరికొన్ని ప్రాంతాలకు చెందిన 300 మంది పిల్లలు ఉన్నారని, 3,4 ప్రదేశాలకు బృందాలను పంపి అక్కడి నుంచి పేపర్ లీకైనట్లు వివరించాడు.






