విపక్ష నేతగా రాహుల్
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియామకం
ప్రొటెం స్పీకర్‌కు తెలిపిన సోనియాగాంధీ
న్యూఢిల్లీ, జూన్ 25: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ నియమితులయ్యారు. ఆయనను ప్రతిపక్ష నేతగా నియమించినట్టు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు మంగళవారం లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు ఆయన నివాసంలో మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నికతోపాటు పలు అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలోనే రాహుల్‌గాంధీని ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఒప్పించినట్టు పార్టీ నేతలు తెలిపారు. నిజానికి ఆయన కొద్ది రోజుల ముందే ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్‌గాను పార్టీ లోక్‌సభాపక్ష నేతగా ఎంపిక చేసింది. అయితే, ఆ పదవి చేపట్టం ఇష్టమో కాదో కూడా ఆయన వెంటనే చెప్పలేదు. తాజాగా ఇండియా కూటమి మొత్తానికి నాయకత్వం వహించే విపక్ష నేత పదవిని కట్టబెటింది. ఇందుకు ఆయన ఒప్పుకొన్నట్టు సమాచారం. రాహుల్‌గాందీ ఇప్పటివరకు ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.






