జైపాల్‌రెడ్డి సేవలు మరవలేనివి
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
రంగారెడ్డి, జూలై 28(విజయక్రాంతి): రాజనీతితో కూడిన రాజకీయం చేసిన మహోన్నత నా యకుడు జైపాల్రెడ్డి అని, ఆయన సేవలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కొనియాడారు. జైపాల్రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద ఉన్న జైపాల్రెడ్డి ఘాట్ (సమాధి) వద్ద కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు ముఖ్యమంత్రి సతీమణి గీతా రెడ్డి, పలువురు ప్రముఖ నేతలు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ జైపాల్రెడ్డి విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా జీవితాన్ని గడిపిన గొప్ప ప్రజానేత అని గుర్తు చేశారు.ఉత్తమ పార్లమెంటేరియన్గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా, పార్లమెంట్లో తన వాక్చాతుర్యం, విషయ పరిజ్ఞానంతో ప్రత్యేక ముద్ర వేశారు.
రాజకీయ నైతికతకు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన నిరంతరం కృషి చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం పేరును ప్రపంచ స్థాయి కి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.






